Nepal PM India Tour: నేపాల్ ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహల్ ప్రచండ మూడోసారి దేశ అత్యున్నత కార్యనిర్వాహక పదవిని చేపట్టిన తర్వాత తన మొదటి విదేశీ పర్యటనలో త్వరలో భారతదేశాన్ని సందర్శిస్తానని చెప్పారు. ప్రచండ గత ఏడాది డిసెంబర్ 26న మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. త్వరలో భారతదేశాన్ని సందర్శిస్తానని ప్రచండ ప్రధానిగా ఎన్నికైన తర్వాత విలేఖరులతో అన్నారు. ఇందుకు సంబంధించి దౌత్య స్థాయిలో సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. సంబంధిత రాయబార కార్యాలయాలు తన పర్యటన కోసం సన్నాహాలు చేస్తున్నాయని ఆయన ప్రధానమంత్రి అధికారిక నివాసమైన బలువతార్‌లో విలేకరులతో అన్నారు.
అయితే ప్రధాని భారత పర్యటనను నేపాల్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. పర్యటన తేదీ, ప్రయాణం ఇంకా ఖరారు కాలేదు. ప్రధాని పర్యటన తేదీ, వివరణాత్మక కార్యక్రమాలతో పాటు పర్యటన ఎజెండాను ఖరారు చేయడానికి కృషి చేస్తున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖలోని ఒక అధికారి తెలిపారు. ప్రధానమంత్రి పదవిని స్వీకరించిన తర్వాత పొరుగు దేశాన్ని సందర్శించడం సాధారణ ప్రక్రియ అని ఆయన వెల్లడించారు. ప్రచండ అంతకుముందు నేపాల్ ప్రధానిగా ఉన్న సమయంలో కూడా భారతదేశానికి అధికారిక పర్యటనలు చేశారు. గతేడాది జూలైలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆహ్వానం మేరకు ప్రచండ భారత్‌లో పర్యటించారు.
Naatu Naatu Song: నాటు నాటును బాగానే వాడేస్తున్నారుగా… ట్రెండ్ ఫాలో అవుతున్న పోలీసులు
నేపాలీ ప్రధానులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తమ మొదటి విదేశీ పర్యటనకు సాంప్రదాయకంగా న్యూఢిల్లీని ఎంచుకుంటారు. కానీ ప్రచండ 2008లో తొలిసారిగా ప్రధానమంత్రిగా ఎన్నికైన తర్వాత భారత్‌కు వెళ్లకుండానే ఒలింపిక్స్ ప్రారంభోత్సవం కోసం బీజింగ్‌ను సందర్శించేందుకు వెళ్లిపోయారు. అయితే ఆయన రెండోసారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, సెప్టెంబరు, 2016లో విదేశీ పర్యటనలో మొదటిసారి భారతదేశానికి వచ్చారు. కొత్త రాష్ట్రపతి ఎన్నిక తర్వాతే ప్రచండ పర్యటన ఉంటుందని పలువురు నేతలు వెల్లడించినట్లు సమాచారం. రాష్ట్రపతిని ఎన్నుకోకముందే భారత పర్యటనకు పట్టుబట్టినట్లయితే పర్యటన ముందుగానే జరగొచ్చని వారిలో ఒకరు చెప్పారు. ప్రెసిడెంట్ బిద్యా దేవి భండారీ పదవీకాలం మార్చి నెలాఖరుతో ముగియనుండడంతో ఫిబ్రవరిలో రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. రాజ్యాంగం ప్రకారం, అధికారంలో ఉన్న వ్యక్తి పదవీకాలం ముగియడానికి ఒక నెల ముందు ఎన్నికలు నిర్వహిస్తారు.