New Zealand Bowler Neil Wagner Retirement: న్యూజిలాండ్ వెటరన్ పేసర్ నీల్ వాగ్నర్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 37 ఏళ్ల వాగ్నర్ స్వదేశంలో ఫిబ్రవరి 29 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్టు సిరీస్ అనంతరం క్రికెట్ నుంచి తప్పుకోనున్నాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు కూడా ధృవీకరించింది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పకున్నా.. దేశీయ క్రికెట్‌లో నార్తర్న్ డిస్ట్రిక్ట్ కోసం వాగ్నర్ ఆడనున్నాడు. టెస్ట్ క్రికెట్‌లో తనదైన ముద్రవేసిన వాగ్నర్.. 12 ఏళ్ల కెరీర్‌కు గుడ్ బై చెప్పాడు.
‘న్యూజిలాండ్ తరపున ప్రాతినిథ్యం వహించడం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నా. కివీస్ తరపున టెస్ట్ క్రికెట్ ఆడిన ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను. అయితే జట్టులో కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇచ్చే సమయం అసన్నమైంది. అందుకే ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నాను. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలకనున్నా. నా 12 ఏళ్ల కెరీర్‌లో మద్దతుగా నిలిచిన న్యూజిలాండ్ క్రికెట్‌కు, సహచరలకు, అభిమానులకు ధన్యవాదాలు’ అని కివీస్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ నీల్ వాగ్నర్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు.
Also Read: Lok Sabha Polls 2024: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న స్టార్ హీరో!
2012లో వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో న్యూజిలాండ్ తరపున నీల్ వాగ్నర్ అరంగేట్రం చేశాడు. టెస్టుల్లో వాగ్నర్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తుంపు తెచ్చుకున్నాడు. కేవలం టెస్టుల్లో మాత్రమే న్యూజిలాండ్‌కు అతడు ప్రాతినిథ్యం వహించాడు. ఇప్పటివరకు 64 టెస్టులు ఆడిన వాగ్నర్.. 260 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఐదో కివీస్ బౌలర్‌గా వాగ్నర్ రికార్డుల్లో ఉన్నాడు. దక్షిణాఫ్రికాలో జన్మించిన వాగ్నర్.. 2008లో న్యూజిలాండ్‌కు మకాం మార్చాడు. దేశీవాళీ క్రికెట్‌లో నార్తరన్ డిస్ట్రిక్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఆపై ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అదరగొట్టడంతో న్యూజిలాండ్ తరపున అరంగేట్రం చేశాడు.