NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..

Neet Ug 2026 Paper Leak Case

Neet Ug 2026 Paper Leak Case

NEET UG 2026 Paper Leak Case: నీట్ (NEET-UG 2026) కుంభకోణం కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ (CBI)కి ఈరోజు మరో కీలక విజయం దక్కింది. పేపర్ సెట్టింగ్ కమిటీ సభ్యురాలిగా ఉంటూ అరెస్ట్ అయిన మనీషా మంధారేను ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టగా, నిందితుల చాకచక్యాన్ని గమనించిన న్యాయస్థానం సీబీఐకి పూర్తి స్థాయిలో 14 రోజుల కస్టడీని మంజూరు చేసింది. ఈ పేపర్ లీక్ ఎంత పకడ్బందీగా జరిగిందో కోర్టు రూమ్‌లో సీబీఐ వినిపించిన వాదనలు స్పష్టం చేశాయి. కోర్టులో సీబీఐ వెల్లడించిన నిజాల ప్రకారం.. మనీషా మంధారే సాదాసీదా నిందితురాలు కాదు.. ఆమె బాటనీ (వనస్పతి శాస్త్రం), జూలాలజీ (జంతు శాస్త్రం) ప్రశ్నపత్రాలను అనువదించడంలో నిపుణురాలు. ఈ కారణంగానే ఆమెకు నేరుగా ఒరిజినల్ ప్రశ్నపత్రాలను చూసే అవకాశం దక్కింది. దీనిని ఆసరాగా చేసుకునే ఆమె మొత్తం వ్యవస్థను మోసం చేసింది.

అంతేకాదు.. ఈ కుట్ర వెనుక ఒక త్రికోణ నెట్‌వర్క్ ఉంది. మనీషా మంధారే ఒంటరిగా కాకుండా పి.వి. కులకర్ణి, మనీషా వాఘ్మారేలతో కలిసి ఈ కుట్రకు పాల్పడింది. తన వద్ద ఉన్న ఒరిజినల్ ప్రశ్నపత్రాన్ని ఆమె శుభమ్ అనే మరో నిందితుడికి చేరవేయగా, అతను దానిని మరింత అందరికీ పంపిణీ చేశాడు. ఈ నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా విస్తరించి ఉండటంతో, ప్రస్తుతం దేశంలోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు, విచారణలు జరుగుతున్నాయని, అందుకే మనీషాను విచారణ కోసం, ఆధారాల సేకరణ కోసం దేశంలోని వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లాల్సి ఉందంటూ సీబీఐ 14 రోజుల భారీ కస్టడీని కోరింది. పరీక్షలు నిర్వహించే సంస్థలను గుడ్డిగా నమ్మే కోట్ల మంది తల్లిదండ్రుల నమ్మకాన్ని ఈ ఉదంతం నట్టేట ముంచింది. పేపర్లు తయారు చేసేవారే, వాటిని అనువదించేవారే ఇలా కంచె చేను మేసినట్లు ప్రవర్తిస్తే, పిల్లల కష్టానికి దక్కే ‘ఫలితం’ ముందే అమ్ముడుపోయినట్లే కదా! ఈ 14 రోజుల రిమాండ్‌లో సీబీఐ ఈ మొత్తం ముఠాకు సంబంధించిన చివరి లింకును కూడా ఛేదిస్తుందని ఆశిద్దాం!!