వైసీపీ హయాంలో విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చారని వెంకటగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నారు. ‘నాడు-నేడు’ కింద ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలను మాజీ సీఎం వైఎస్ జగన్ మార్చారన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రభుత్వ పాఠశాలలు అక్కడ వసతులు చూసి ఆశ్చర్యపోయారన్నారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి లోకేష్ కూడా ప్రభుత్వ బడులను పొగిడారన్నారు. సీఎం చంద్రబాబు అంతా ప్రైవేట్ రంగానికి లబ్ది కలిగిస్తారని నేదురుమల్లి మండిపడ్డారు.
నెల్లూరులో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ‘వైసీపీ హయాంలో విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ప్రాథమిక స్థాయిలో ఎన్‌రోల్‌మెంట్ పెరిగేందుకు అమ్మఒడి పథకాన్ని అమలు చేశారు. నాడు-నేడు కింద పాఠశాలల రూపు రేఖలు మార్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రభుత్వ పాఠశాలలు, అక్కడ వసతులు చూసి ఆశ్చర్యపోయారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి లోకేష్ కూడా ప్రభుత్వ బడులను పొగిడారు. విద్య అనేది మానవ వనరుల అభివృద్ధి. సీఎం చంద్రబాబు మాత్రం సంక్షేమ పథకంగా చూస్తూ.. ఎన్నికల్లో ఒక్కో విద్యార్థికి 18 వేలు ఇస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు డేటా అవసరమని చెబుతూ.. దాన్ని దాట వేస్తున్నారు. రాష్ట్ర వృద్ధి రేటు 14 శాతానికి చేరితే అన్ని పథకాలు అమలు చేస్తామని ఇప్పుడు అంటున్నారు. అంటే పథకాలను అమలు చేయబోమని పరోక్షంగా చెబుతున్నారు’ అని మండిపడ్డారు.
‘పిల్లలకు చదువు ఎంతో ముఖ్యం.. దానికి గండి కొట్టడం సరికాదు. వైఎస్ జగన్ హయాంలో ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వలేదు.. ఇప్పుడు ఎందుకు ఇవ్వాలనే ధోరణిలో మంత్రి లోకేష్ వున్నారు. 2019 నాటికి టీడీపీ ప్రభుత్వం పెట్టిన బకాయిలను జగన్ అధికారంలోకి వచ్చి చెల్లించారు. జగన్ వచ్చిన తరువాత విద్యకు జీడీపీలో రెట్టింపు నిధులు ఇచ్చారు. 2047 విజన్ అంటున్నారు.. ఇప్పుడు విద్యా రంగాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. విద్యార్థులు లేకుండా విజన్ 2047 ఎలా సాధిస్తారు?. చంద్రబాబు అంతా ప్రైవేట్ రంగానికి లబ్ది కలిగిస్తారు. అందుకే హెరిటేజ్ లాభాల్లో ఉండగా.. ప్రభుత్వ రంగానికి చెందిన విజయడైరీ మాత్రం నష్టాల్లో ఉంది. ఇదీ చంద్రబాబు పాలన. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, తగిన నిర్ణయం తీసుకుంటారు’ అని రామ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.