CM YS Jagan Delhi Tour: ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి హస్తిన పర్యటన ముగిసింది.. ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు బయల్దేరారు సీఎం.. ఈ పర్యటనలో బిజీబిజీగా గడిపారు.. మూడు రోజుల పర్యటనలో నీతి అయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొన్నారు.. పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్. హోంమంత్రి అమిత్ షాలతో సీఎం జగన్ విడివిడిగా భేటీ అయ్యారు. ఇరువురు నేతలు దాదాపు 40 నిమిషాల పాటు వివిధ అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి.
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలకు త్వరగా ఆమోదం తెలిపేలా చూడాలని అమిత్ షాను కోరారు జగన్. దానికి కేంద్ర కేబినెట్ వీలైనంత త్వరగా ఆమోదం తెలిపేలా చూడాలన్నారు. అలాగే, ఆంధప్రదేశ్ విభజన తర్వాత ఏపీ, తెలంగాణల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాల గురించి ప్రస్తావించారు జగన్. సమస్య పరిష్కరానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు జగన్. ఢిల్లీలోని ఏపీ భవన్ సహా షెడ్యూల్ 9, 10లోని ఆస్తుల విభజనపైనా అమిత్ షాతో చర్చించారు జగన్. తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిల అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల ఆర్థిక స్థిగతులను పరిగణలోకి తీసుకుని వెంటనే బకాయిలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని అమిత్ షాను కోరారు ఏపీ సీఎం జగన్.
మొన్న ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం జగన్… ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొన్నారు. నీతి ఆయోగ్ 8వ పాలక మండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన పెట్టుబడులు, మౌలిక సదుపాయాల బలోపేతంతో ఆర్థికవ్యవస్థ మరింత వేగంగా పరుగులెడుతోందన్నారు. ఏపీ సాధించిన ప్రగతిపై నీతిఆయోగ్ సమావేశానికి నోట్ ఇచ్చిన సీఎం జగన్.. భారత్‌లో లాజిస్టిక్స్ కోసం పెడుతున్న ఖర్చు జీడీపీలో 14శాతంగా ఉందన్నారు. లాజిస్టిక్స్ ఖర్చు ఎక్కువగా ఉండడంతో.., భారత్ ఉత్పత్తులు ప్రపంచస్థాయిలో పోటీపడేందుకు ప్రతిబంధకంగా మారిందన్నారు. ఏపీ ప్రభుత్వం పోర్ట్ ఆధారిత అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు సీఎం జగన్. ఏపీలో కొత్తగా 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటవుతున్నాయన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ మూడేళ్లుగా దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచిందన్నారు. విలేజ్ క్లినిక్ కాన్సెప్ట్‌ను పూర్తి సామర్థ్యంతో అమలు చేయడానికి ఏపీ ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం చేపట్టిందన్నారు. దేశ GDPలో తయారీ, సేవల రంగం వాటా 85 శాతం దాటినప్పుడే వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరుతుందన్నారు సీఎం జగన్.
ఇక, ఆ తర్వాత కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. పోలవరం ప్రాజెక్ట్‌పై ప్రధానంగా చర్చ జరిగింది. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచాన వ్యయం నిధులు సహా పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని కేంద్ర మంత్రి షెకావత్‌కు సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. అరగంట సేపు వీరిద్దరి సమావేశం కొనసాగింది. సీఎం జగన్ విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి షెకావత్ సానుకూలంగా స్పందించినట్లు తెలసింది. మరోవైపు ఢిల్లీ వెళ్లిన తొలిరేజే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాలసేపు సాగిన సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించిన సహాయానికి కృతజ్ఞతలు తెలియజేశారు.. మొత్తంగా హస్తిన పర్యటన ముగించుకుని ఢిల్లీ నుంచి విజయవాడకు బయల్దేరారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. గన్నవరం ఎయిర్‌పోర్ట్ చేరుకోనున్న ఆయన.. అక్కడ నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు.