Medicos Suicide: దేశవ్యాప్తంగా ఐదేళ్లలో 119 మంది మెడికోలు ఆత్మహత్య చేసుకున్నట్లు జాతీయ వైద్య మండలి వెల్లడించింది. ఈ మేరకు జాతీయ వైద్య మండలి రిపోర్టు నివేదించింది. ఆత్మహత్యకు పాల్పడిన వారిలో ఎంబీబీఎస్ తదితర వైద్య యూజీ గ్రాడ్యుయేట్లు 64 మంది ఉండగా.. 55 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. వేధింపులు, ఒత్తిడి కారణాల వల్ల దేశవ్యాప్తంగా ఐదేళ్లలో 1,166 మంది విద్యార్థులు మెడిసిన్‌కు గుడ్‌బై చెప్పారని జాతీయ వైద్య మండలి రిపోర్టు వివరించింది.
ఎంబీబీఎస్ యూజీలో 160 మంది, పీజీ జనరల్ సర్జరీలో 114 మంది, ఎంఎస్ ఆర్థోపెడిక్స్‌లో 50 మంది, గైనకాలజీలో 103, ఎంఎస్ ఈఎన్‌టీలో 100, ఎండీ జనరల్ మెడిసిన్‌లో 56, ఎండీ పిడియాట్రిక్స్‌లో 54, ఇతర బ్రాంచ్‌లన్నింటిలో కలిపి 529 మంది వైద్యవిద్యను మధ్యలోనే వదిలి వెళ్లిపోయినట్లు వెల్లడించింది. వైద్య వృత్తిలో తలెత్తే ఒత్తిడి కారణంగా యువ వైద్యులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వివరించింది. ఆత్మహత్యల్లో 60 శాతం ఒత్తిడి సంబంధించినవేనని మండలి వివరించింది.
Read Also: Rakshita Suicide : ప్రైవేటు ఫోటోలు బయటకు రావడంతో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
వైద్య విద్యార్థుల్లో ఎఫ్‌ఎంజీఈ (ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ పరీక్ష) పాసయ్యేవారు 20 శాతం వరకే ఉంటున్నారు. ఆ పరీక్ష పాసయ్యితేనే మన దేశంలో మెడికల్ రిజర్వేషన్‌కు అర్హత ఉంటుంది. దీంతో ఒత్తిడితో పాటు అనేక కారణాల వల్ల విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.