ప్రజా జీవితంలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ ఫెయిల్ అయిన జగన్ రెడ్డి ఇప్పటికైనా బాధ్యతగా వ్యవహరించాలని మంత్రి నారా లోకేష్ అన్నారు. చిన్నప్పుడే టెన్త్ పేపర్లు ఎత్తుకుపోయిన మీ నుంచి హుందాతనం ఆశించడం తప్పే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూనిఫామ్ దగ్గర నుంచి చిక్కీ వరకూ పార్టీ రంగులు, మీ పేరు పెట్టుకొని ఇప్పుడు విలువలు మాట్లాడటం మీకే చెల్లిందని..ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం, ఉచితంగా ఇచ్చే టెక్స్ట్ బుక్స్ రద్దు చేసిన మీరూ మాట్లాడటమేనా? అని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు ఉపాధ్యాయులను మద్యం షాపుల ముందు కాపలా పెట్టిన మీరు ఇప్పటికీ వారి పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జీఓ 117, ఇతర అసంబద్ధ నిర్ణయాల వలన మీ ఐదేళ్ల ఏలుబడిలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 12 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ల బాట పట్టారన్నారు. ఉపాధ్యాయులను, విద్యార్థులను సిద్ధం చెయ్యకుండానే వెయ్యి పాఠశాలల్లో సిబిఎస్ఈ పరీక్షా విధానాన్ని మీరు తీసుకొచ్చారని..నేను మంత్రి అయిన వెంటనే నిర్వహించిన టెస్ట్ లో 90శాతం మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారని చెప్పారు. పదో తరగతి ఫెయిల్ అయితే చదువుకు దూరం అయ్యే ప్రమాదం ఉందని.. ముఖ్యంగా ఆడపిల్లలు అయితే చదువు ఆపించి పెళ్లి చేస్తారన్నారు. వారి భవిష్యత్తు కోసం ఆలోచించే సిబిఎస్ఈ పరీక్షా విధానాన్ని వాయిదా వేశామని తెలిపారు. ప్రణాళికాబద్ధంగా ఉపాధ్యాయులను, విద్యార్థులను సిద్ధం చేసిన తరువాతే సిబిఎస్ఈ పరీక్షా విధానాన్ని అమలు చెయ్యాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మీరు భ్రష్టు పట్టించిన వ్యవస్థను గాడిన పెట్టేందుకు నిరంతరం శ్రమిస్తున్నామన్నారు.
READ MORE: Kannappa : శివరాజ్ కుమార్ మూవీలో.. విలన్ రోల్ అడిగిన మోహన్ బాబు
టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ ద్వారా రాజకీయాలకు అతీతంగా ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ చేపడుతున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. “కేజీ నుండి పీజీ వరకూ పాఠ్య ప్రణాళిక మారుస్తున్నాం. పదో తరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో తమకు అన్యాయం జరిగిందని విద్యార్థులు భావించినప్పుడు రీ కౌంటింగ్/రీ వెరిఫికేషన్ కోరడం ఎప్పటినుంచో జరుగుతున్న ప్రక్రియ.. ఈ ఏడాది 45,96,527 లక్షల విద్యార్థుల జవాబు పత్రాలను మూల్యాంకనం చేయడం జరిగింది. రీ కౌంటింగ్/ రీ వెరిఫికేషన్ తరువాత మార్కులలో వ్యత్యాసం వచ్చిన జవాబు పత్రాల సంఖ్య 11,175. 99.75 శాతం ఖచ్చితత్వంతో మూల్యాంకనం జరిగింది. మానవ తప్పిదం 0.25 శాతం మాత్రమే. ఈ ఏడాది కూడా 34,709 మంది విద్యార్థులు 66,363 స్క్రిప్టుల రీ కౌంటింగ్/ రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. జగన్ రెడ్డి గారి జమానాలో 2022లో 41,694 స్క్రిప్టుల రీ కౌంటింగ్/ రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో 8,235 స్క్రిప్టుల (20 శాతం) వ్యత్యాసాలను గుర్తించారు. మీ హయాంలో కనీసం ఈ వివరాలను బయట పెట్టే ధైర్యం కూడా చెయ్యలేదు. ఈ వాస్తవాలను మరుగున పెట్టి మాపై బురద జల్లడం సిగ్గుచేటు.” అని లోకేష్ వ్యాఖ్యానించారు.