Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!

  • స్టీల్ ప్లాంట్‌లో ఇలాంటి ప్రమాదం జరగడం దురదృష్టకరం
  • బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం
  • బాధిత కుటుంబాల్లోని పిల్లల బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది
  • కార్మికులకు భరోసా కల్పించాలన్నదే మా ఉద్దేశం
Nara Lokesh, Vizag Steel Plant

Nara Lokesh, Vizag Steel Plant

Job for Vizag Steel Plant Victims Familyవిశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ మంగళవారం విశాఖపట్నంలో పర్యటించారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న ఆయన.. అక్కడి నుంచి నేరుగా నగరంలోని సెవెన్ హిల్స్ ఆస్పత్రికి వెళ్లి ప్రమాదంలో గాయపడిన కార్మికులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని.. మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. అనంతరం విశాఖ స్టీల్ ప్లాంట్‌కు చేరుకున్న లోకేశ్.. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అధికారులతో సమావేశమై ప్రమాదానికి గల కారణాలపై వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి నారా లోకేశ్.. స్టీల్ ప్లాంట్‌లో ఇలాంటి ప్రమాదం జరగడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ఇప్పటికే ప్రకటించిన పరిహారంతో పాటు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి అదనంగా ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని లోకేశ్ తెలిపారు. అలాగే మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని స్పష్టం చేశారు. బాధిత కుటుంబాల్లోని పిల్లల భవిష్యత్తు బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకుంటుందని పేర్కొన్నారు. కార్మికులకు భరోసా కల్పించడమే తమ ప్రధాన ఉద్దేశమని మంత్రి చెప్పారు.

×
×
Ad

ప్రమాదంపై మాట్లాడిన నారా లోకేశ్.. ఉక్కు తయారీ ప్రక్రియలో ఎలాంటి వైఫల్యం లేదని, కెమికల్ రియాక్షన్లలో కూడా లోపాలకు అవకాశం కనిపించలేదని తెలిపారు. అయితే ప్రమాదం ఎందుకు జరిగిందన్న విషయం ఇప్పటికీ సిబ్బందికి, యాజమాన్యానికి పూర్తిగా అర్థం కాలేదన్నారు. ప్రమాదానికి అసలు కారణాలు వెలుగులోకి వస్తే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ఆర్థిక పరిస్థితులపై కూడా లోకేశ్ స్పందించారు. ఒకప్పుడు లాభాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్‌ను గత ప్రభుత్వాల నిర్ణయాలు నష్టాల బాట పట్టించాయని విమర్శించారు. మృతుల అంత్యక్రియలు పూర్తయిన తర్వాత వారి కుటుంబాలను వ్యక్తిగతంగా కలిసి అవసరమైన సహాయంపై చర్చిస్తామని తెలిపారు.

విపత్తు బాధితులను ఆదుకోవడంలో తమ ప్రభుత్వం కేవలం పరిహారం ప్రకటించి మరిచిపోయే విధానం అనుసరించదని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఎల్జీ పాలిమర్స్ ప్రమాద బాధితుల కోసం ట్రస్ట్ ఏర్పాటు చేసినది కూడా ఎన్డీఏ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. ప్రమాదం జరిగిన ఆరు గంటల్లోనే కేంద్ర మంత్రి కుమారస్వామి ప్లాంట్‌ను సందర్శించారని చెప్పారు. బాధిత కుటుంబాలకు అవసరమైన ప్రతి సహాయం అందిస్తామని, తమ బాధ్యతను పూర్తిగా నిర్వర్తిస్తామని నారా లోకేశ్ హామీ ఇచ్చారు.