Lagacharla Incident: లగచర్లలో అధికారులపై దాడి కేసులో నిందితులందరికీ నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం బెయిల్‌ను మంజూరు చేసింది. పట్నం నరేందర్ రెడ్డితో పాటు సురేష్, మిగతా నిందితులు అందరికీ బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పట్నం నరేందర్ రెడ్డి రెండు 50 వేల ష్యూరిటీలు, మిగతా వారు 20 వేల పూచీకత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. మూడు నెలల పాటు ప్రతి బుధవారం పోలీసుల ముందు విచారణ హాజరుకావాలని పట్నం నరేందర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. లగచర్లలో కలెక్టర్‌పై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డితో పాటు సురేష్, మిగతా 24 మంది రైతులకు బెయిల్ మంజూరైంది.
Read Also: Kishan Reddy: అదానీ అంశంపై మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదు..
వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మా కంపెనీ స్థాపనపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ , ఇతర రెవెన్యూ అధికారులపై స్థానికుల దాడి జరిగింది. ఈ దాడిలో అధికారులు ప్రయాణిస్తున్న వాహనాలను రాళ్లతో ధ్వంసం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన అధికారులపై దాడి జరగడంతో రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. కాంగ్రెస్ పార్టీ ఈ ఘటన వెనుక బీఆర్ఎస్ పార్టీ హస్తం ఉందని ఆరోపించింది. స్థానికులను రెచ్చగొట్టి అధికారులపై దాడి చేయించారని కాంగ్రెస్ విమర్శలు చేసింది. బీఆర్ఎస్ నేతల ఆదేశాల మేరకు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తన అనుచరుడు భోగమోని సురేష్‌తో కలిసి ఈ దాడి ప్లాన్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.