Bike Taxi: బైక్ టాక్సీలపై ప్రభుత్వం చేపట్టిన నిర్బంధ చర్యలను వెంటనే నిలిపివేయాలని కోరుతూ.. నమ్మ బైక్ టాక్సీ అసోసియేషన్‌కి చెందిన 110 మంది బైక్ టాక్సీ డ్రైవర్ల బృందం కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి దినేష్ గుండూరావు తోపాటు, దసరహళ్లి ఎమ్మెల్యే ఎస్. మునిరాజును గురువారం కలిసింది. వేలాది బైక్ టాక్సీ రైడర్లకు ప్రాతినిధ్యం వహించిన ఈ బృందం, బైక్ టాక్సీలను చట్టబద్ధంగా గుర్తించి, తగిన విధానాలతో హక్కులను నిర్ధారించాలంటూ వినతి పత్రం సమర్పించింది. డ్రైవర్లపై జరుగుతున్న వేధింపులు, స్పష్టతలేని విధానాలు వారిని ఆర్థికంగా అస్తవ్యస్తం చేస్తున్నాయని వారు వాపోయారు.
Read Also: Upendra Kushwaha: నాకు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి మరణభయం ఉంది.. ఎంపీ సంచలన వ్యాఖ్యలు..!
ఇప్పటికే ముఖ్యమంత్రి సిద్ద రామయ్య, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీలకు పలు బహిరంగ లేఖలు రాసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదని వారు తెలిపారు. ప్రభుత్వం ఇటీవలే గిగ్ వర్కర్ల సంక్షేమ బిల్లును ఆమోదించినప్పటికీ, అదే ప్రభుత్వం వేల మందికి జీవనాధారమైన బైక్ టాక్సీలను నిషేధించే ప్రయత్నం చేస్తోందని డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా నమ్మ బైక్ టాక్సీ అసోసియేషన్ అధ్యక్షుడు మొహమ్మద్ సలీం మాట్లాడుతూ.. ‘ప్రతి రోజూ 250 నుండి 300 మంది డ్రైవర్లు నాకు ఫోన్ చేస్తున్నారు. వారిని ఎలా ఆదుకోవాలో నాకు అర్థం కావడం లేదు. ప్రభుత్వానికి బైక్ టాక్సీలపై విధానం లేకపోవడం వల్ల మేము మా జీవనోపాధిని కోల్పోవాలా? మాకు నిర్బంధం కాదు, నియంత్రణ కావాలని స్పష్టం చేశారు.
Read Also: Maoist Aruna: మావోయిస్టు అగ్రనేత అరుణ అంత్యక్రియలు పూర్తి!
ఆటో యూనియన్ల నుంచి వస్తున్న బెదిరింపులపై కూడా డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. బైక్ టాక్సీల నిరసనలను అడ్డుకోవాలంటూ ఒక ఆటో యూనియన్ నేత సభ్యులను ప్రేరేపిస్తున్నారని, బైక్ టాక్సీలకు మద్దతుగా మాట్లాడిన ప్రముఖులు కూడా లక్ష్యంగా మారుతున్నారని పేర్కొన్నారు. ‘గత సంవత్సరం కర్ణాటకలో 8 కోట్లకు పైగా బైక్ టాక్సీ ప్రయాణాలు జరిగాయి. మేము ఉపకారం అడగం. మేము కేవలం చట్టబద్ధంగా, సురక్షితంగా పని చేసే హక్కు అడుగుతున్నాం అని మరోసారి స్పష్టం చేశారు.