Upendra Kushwaha: రాష్ట్రీయ లోక్ మోర్చా (RLM) జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఉపేంద్ర కుష్వాహా తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి తనని చంపుతామని హెచ్చరికలు వచ్చాయని ఆయన వెల్లడించారు. గురువారం రాత్రి అనేక ఫోన్ కాల్స్, టెక్స్ట్ సందేశాల రూపంలో బెదిరింపులు వచ్చాయని చెప్పుకొచ్చారు. గత రాత్రి 8:52 గంటల నుండి 9:20 గంటల మధ్య రెండు వేర్వేరు మొబైల్ నంబర్ల నుండి నాకు ఫోన్ కాల్స్ వచ్చాయని.. అలాగే, 10 రోజుల్లో నిన్ను చంపుతాం అంటూ మెసేజ్ కూడా వచ్చిందని తెలిపారు. కాల్ చేసిన వ్యక్తి తనను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడిగా చెప్పుకున్నాడని ఉపేంద్ర కుష్వాహా మీడియాతో పేర్కొన్నారు.
Read Also: Air India flights: ఎయిర్ ఇండియాలో ఏం జరుగుతోంది..? భారీగా అంతర్జాతీయ, దేశీయ విమానాలు రద్దు..!
ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు తెలియజేశానని, వారు దర్యాప్తు ప్రారంభించారని తెలిపారు. ఇది ఒక కీలక భద్రతా అంశం. నేను పాట్నా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌కు సమాచారం ఇచ్చాను. వారు వెంటనే చర్యలు తీసుకుని, బాధ్యులను అరెస్టు చేయాలని కుష్వాహా డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా.. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనపై స్పందించిన కుష్వాహా, ఈ పర్యటన ప్రాంతీయ అభివృద్ధికి మేలుచేసే విధంగా ఉండబోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
Read Also: Piyush Goyal: AI కంటే మానవ మెదడు ఎప్పటికీ గొప్పదే..
సివాన్ ప్రజలు ప్రధానమంత్రి పర్యటన కోసం ఎదురు చూస్తున్నారు. మోదీ ఎక్కడికి వెళ్లినా ఆ ప్రాంతానికి ప్రత్యేక బహుమతులు ఇస్తున్నారు. ఎన్డీఏ పార్టీల మధ్య సీట్ల పంపకం సైతం సజావుగానే జరగనుందని తెలిపారు. జూన్ 20న ప్రధాని మోదీ బీహార్, ఒడిశా పర్యటన ప్రారంభించనుండగా.. జూన్ 21న ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. శుక్రవారం నాడు సివాన్‌లో మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి ప్రారంభించనున్నారు. ‘నమామి గంగే’ ప్రాజెక్టు కింద రూ.1,800 కోట్ల విలువైన ఆరు మలినజల శుద్ధి కేంద్రాలను ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ. అలాగే, రూ.3,000 కోట్ల విలువైన తాగునీటి సరఫరా, పారిశుధ్య, మలినజల శుద్ధి పథకాల శంకుస్థాపన చేయనున్నారు.