Nallapareddy Prasanna Kumar Reddy: ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్తు రాజుపాలెంలో నిర్వహించిన వైయస్సార్ ఆసరా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో చేరి షర్మిల చేస్తున్న ద్రోహానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ ఘోషిస్తుందన్నారు. తన కన్న తండ్రి పై కేసులు నమోదు చేసి.. అన్నను 16 నెలలు జైలుకు పంపిన పార్టీతో షర్మిల చేతులు కలపడం సిగ్గుచేటని మండిపడ్డారు. నీ అన్నని ఓడించాలని.. నీవు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపావు.. భగవంతుడు కూడా నిన్ను క్షమించడని వ్యాఖ్యానించారు. షర్మిలమ్మ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాదని జోస్యం చెప్పారు. అంతేకాదు.. నువ్వు ఎక్కడ పోటీ చేసినా నీకు కూడా డిపాజిట్ కూడా రాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల చేసిన దుర్మార్గానికి స్వర్గంలో ఉన్న రాజశేఖర్ రెడ్డి కూడా కంటతడి పెట్టుకుంటాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, పదేళ్లు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఐదేళ్లు నూతన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని దుయ్యబట్టారు కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.
Read Also: Yatra 2 vs CGTR: యాత్ర2కి పోటీగా కెమెరామెన్ గంగతో రాంబాబు రీ రిలీజ్