ఇండియా కూటమిలో విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ఈసారి మహారాష్ట్ర వంతైంది. కూటమిలో ఉన్న పార్టీలు ఎలాంటి చర్చలు లేకుండానే అభ్యర్థులను ప్రకటించేస్తున్నాయి. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో విభేదాలు తలెత్తాయి. తాజాగా మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే.. చర్చలు లేకుండానే అభ్యర్థులను ప్రకటించేశారు. దీంతో మహావికాస్ అఘాడీలో చీలికలు బయటపడ్డాయి. శివసేన (యూబీటీ)పై కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉద్ధవ్ ఠాక్రే… కిచిడీ ఛోర్ అంటూ మండిపడ్డారు.
ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) బుధవారం తొలి జాబితాను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 17 లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసింది. ఇక ఎంపీ గంజనన్ కీర్తికర్ కుమారుడు అమోల్‌కు తాజా జాబితాలో చోటు దక్కింది. ముంబై నార్త్-వెస్ట్ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఈ ప్రకటన అనంతరం సంజయ్ నిరుపమ్ మీడియాతో మాట్లాడుతూ అమోల్‌కు టికెట్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. శివసేన(యూబీటీ) కిచిడీ చోర్‌కు టికెట్ ఇచ్చిందని ధ్వజమెత్తారు. అలాంటి అభ్యర్థుల కోసం తాము పనిచేయలేమని తేల్చి చెప్పారు.
మహారాష్ట్రలో మొత్తం 48 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. వీటిలో 44 స్థానాలకు మహా వికాస్ అఘాడీ కూటమి పార్టీల మధ్య సర్దుబాటు జరిగింది. ఇందులో భాగంగా శివసేన (యూబీటీ) 19, కాంగ్రెస్ 16, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ పార్టీకి 9 సీట్లను కేటాయించారు. మిగతా నాలుగు స్థానాలకు చర్చలు జరుగుతున్నాయి. అయితే తాము మొత్తం 22 స్థానాల్లో పోటీ చేస్తామని శివసేన (యూబీటీ) నేత సంజయ్‌రౌత్ తాజాగా ప్రకటించడంతో కూటమిలో అసంతృప్తి జ్వాలలకు దారితీస్తోంది.
ఉద్ధవ్ ఠాక్రే వర్గం అమోల్‌కు టికెట్ ఇచ్చిన రోజునే.. కిచిడీ కుంభకోణంలో ఈడీ ఆయనకు సమన్లు జారీ చేసింది. కరోనా కాలంలో వలస కూలీలకు కిచిడీ పంపిణీ చేసేందుకు ఇచ్చిన కాంట్రాక్టుల విషయంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఆ స్కామ్ విచారణలో భాగంగా తాజాగా చర్యలు చేపట్టింది.
ఇది కూడా చదవండి: Rishabh Pant: బజ్ బాల్ ని ఇంట్రడ్యూస్ చేసింది అతను..ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..!
ముంబై సౌత్-సెంట్రల్, సాంగ్లీలో అభ్యర్థులను ప్రకటించడం కాంగ్రెస్‌కు మరింత కోపం తెప్పించింది. ఎందుకంటే ఆ స్థానాలు గురించి ఇంకా చర్చలు జరుగుతున్నాయి. అయినా కూడా వెల్లడించేశారు. ముంబైలోని ఆరు లోక్‌సభ స్థానాల్లో శివసేన (యూబీటీ) ఐదు స్థానాల్లో పోటీ చేస్తుందని.. ఒక సీటు కాంగ్రెస్‌కు కేటాయించారు. ఈ నిర్ణయం కాంగ్రెస్‌ను నాశనం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా నిరుపమ్ అభిప్రాయపడ్డారు. నిరుపమ్ వ్యాఖ్యలను శివసేన (యూబీటీ) ఎంపీ అరవింద్ సావంత్ తప్పుపట్టారు. అతనెవరో మాకు తెలియదన్నారు. మా పార్టీలో క్రమశిక్షణ ఉందని ఆయన చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: West Bengal: మైనర్ బాలికపై అత్యాచారం.. తృణమూల్ నేత కుమారుడిపై ఆరోపణలు..