Anil Kumar Yadav : రాజ్యసభ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ మూసీ నది ప్రస్తావించారు. దేశంలోని ముఖ్యమైన నదుల్లో మూసీ నది ఒకటని, గతంలో దీన్ని ముచ్‌కుందా అనే పేరుతో పిలిచేవారని గుర్తు చేశారు. ఈ నది వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండల్లో ఉద్భవించి, హైదరాబాద్ నగరాన్ని దాటి నల్గొండ, మిర్యాలగూడ ప్రాంతాల గుండా ప్రవహించి కృష్ణా నదిలో కలుస్తుందని వివరించారు. మూసీ నది గాఢమైన చరిత్రను కలిగి ఉందని, హైదరాబాద్ నగరం మూసీ ఒడ్డునే నిర్మించబడిందని చెప్పారు.
అప్పట్లో మూసీ నది తాగునీటి వనరుగా ఉండేదని, నగర ప్రజలు దీని నీటిని నేరుగా తాగేవారని, అంతేకాకుండా అనేక ఎకరాల భూములకు సాగునీటిని అందించేదని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితి దారుణంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని పరిశ్రమలు, మురుగునీటి వ్యవస్థలు మూసీ నదిని కలుషితంగా మార్చేశాయని పేర్కొన్నారు. పరిశ్రమల నుంచి విడుదలయ్యే రసాయనాలు, మురుగు నీరు నదిలో కలుస్తుండడంతో పరిసర గ్రామాలు తీవ్ర ప్రభావానికి గురవుతున్నాయని, మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు ప్రతి ఏడాది ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ICC Champions Trophy-2025: ఛాంపియన్స్ ట్రోఫీ థీమ్ సాంగ్ వచ్చేసింది.. (వీడియో)
ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేతృత్వంలో మూసీ నది పునరుద్ధరణ ప్రాజెక్టును చేపట్టిందని అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభలో ప్రకటించారు. ప్రాజెక్ట్ అమలుకు కేంద్రం సహకరించాలని, నదిని శుభ్రపరిచేందుకు నిధులు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని పలుమార్లు కోరారని వివరించారు. కేంద్రం నిధులు కేటాయిస్తే మూసీ నది పునర్జన్మ పొందుతుందని చెప్పారు. కానీ కేంద్రానికి అనేక వినతులు పంపించినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదని, సహాయం అందకపోవడంతో నదిని పూర్తిగా పునరుద్ధరించేందుకు కష్టాలు ఎదురవుతున్నాయని తెలిపారు.
మూసీ నది అభివృద్ధికి నిధులు కేటాయించాల్సిన అవసరం ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల ప్రాజెక్ట్ ముందుకు సాగడం లేదని చెప్పారు. నదిని అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన వస్తే బీజేపీ నేతలు నిరసనలు తెలియజేస్తారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో బీజేపీ నాయకులు హైదరాబాద్‌కి వచ్చి ప్రచారం చేసుకుంటారని, కానీ మూసీ నది పరిస్థితిపై మాత్రం ఎవరూ మాట్లాడరని విమర్శించారు. నది పునరుద్ధరణ కోసం కేంద్రం నిధులు మంజూరు చేస్తే నగరం మళ్లీ మునుపటిలా స్వచ్ఛమైన నీటితో కళకళలాడుతుందని అభిప్రాయపడ్డారు.
ఈ ప్రస్తావనతో మూసీ నది అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ సహకారం, రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలపై చర్చ మరింత వేడెక్కిన విషయం స్పష్టమైంది. మూసీ నది ప్రక్షాళన ఎప్పుడు పూర్తవుతుందనేది ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న అంశంగా మారింది.
Delhi Election : ఫలితాల ముందు ఎన్నికల సంఘం పై ప్రశ్నలు లేవనెత్తిన అరవింద్ కేజ్రీవాల్