Mumbai Terror Alert: ఉగ్రవాదం పెనుభూతమై ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. ఉగ్రదాడుల కారణంగా భారత్‌లో అమాయక ప్రజలు ప్రాణాలు వదిలిన సంఘటనలు గతంలో చోటుచేసుకున్నాయి. తాజా ఓ వార్త సంచలనం రేపుతోంది.. దేశంలోకి 14 మంది ఉగ్రవాదులు ప్రవేశించారని పోలీసులకు వచ్చిన మెసేజ్‌తో అధికారలందరూ అలర్ట్ అయ్యారు. ముంబైలోకి సుమారుగా 14 మంది ఉగ్రవాదులు 400 కిలోల ఆర్‌డీఎక్స్‌తో ప్రవేశించారని ముంబై ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు ఒక మెసేజ్ వచ్చింది. ఈ మెసేజ్‌కు సంబంధించిన సమాచారాన్ని ఒక అధికారి తెలియజేశారు.
READ ALSO: Visakhapatnam: విశాఖలో జరిగే ACIAM అంతర్జాతీయ మధ్యవర్తిత్వ సదస్సుకు హాజరుకానున్న సీఎం చంద్రబాబు
34 వాహనాల్లో 400 కిలోల ఆర్‌డీఎక్స్..
ఈసందర్భంగా ఆ అధికారి మాట్లాడుతూ.. గణేష్ పండుగ 10వ రోజు అయిన అనంత చతుర్దశికి పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. ఇంతలో ట్రాఫిక్ పోలీసు కంట్రోల్ రూమ్‌కు వాట్సాప్ హెల్ప్‌లైన్‌లో బెదిరింపు సందేశం వచ్చిందని తెలిపారు. బెదిరింపు సందేశంపై క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు ప్రారంభించిందని, ఉగ్రవాద నిరోధక దళం (ATS), ఇతర సంస్థలకు కూడా సమాచారం అందించామని చెప్పారు. ఆ సందేశం పంపిన వ్యక్తి ‘లష్కర్-ఎ-జిహాదీ’ అనే సంస్థ పేరు రాశాడని పేర్కొన్నారు. 14 మంది ఉగ్రవాదులు నగరంలోకి ప్రవేశించారని, వారు 34 వాహనాల్లో 400 కిలోల ఆర్‌డీఎక్స్‌ను ఉంచారని ఆయన తెలిపారు.
ముంబైలో గత 10 రోజులుగా గణేష్ పండుగను నిర్వహిస్తున్నారు. శనివారం చివరి రోజు సందర్భంగా వినాయక నిమజ్జనం నేపథ్యంలో నగర వీధుల్లో జనాలు గుమిగూడే అవకాశం ఉన్నందున పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈక్రమంలో ముంబై ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు ఈ సందేశం వచ్చింది. ఈ మెసేజ్‌ను ఎవరు పంపారో తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ప్రధాన వీధుల్లో భద్రతను పెంచామని, వివిధ ప్రదేశాలలో సోదాలు నిర్వహిస్తున్నామని పోలీసులు పేర్కొ్న్నారు.