2025 ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) ఫైనల్ మ్యాచ్ (మార్చి 15) శనివారం జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్-ముంబై ఇండియన్స్ జట్లు తుది పోరులో తలపడ్డాయి. ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన ముంబై ఇండియన్స్ ఫైనల్‌కు చేరుకుంది.. ఢిల్లీ క్యాపిటల్స్ నేరుగా ఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 8 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలుపొందింది. వరుసగా మూడు సీజన్లలో ఫైనల్ వరకు చేరిన ఢిల్లీ క్యాపిటల్స్.. ట్రోఫీని దక్కించుకోలేకపోయింది. ముంబై ఇండియన్స్ జట్టు మహిళల ప్రీమియర్ లీగ్ 2025 టైటిల్‌ను కైవసం చేసుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 149 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ (66) హాఫ్ సెంచరీతో రాణించింది. నాట్ సివర్ బ్రంట్ (30) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడింది. మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో మరిజాన్ కాప్, జెస్ జొనస్సెన్, శ్రీ చరణి తలో 2 వికెట్లు తీశారు. ఆ తర్వాత 150 పరుగుల లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్.. మరిజాన్ కాప్ (40) పరుగులతో రాణించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. జెమియా రోడ్రిగ్స్ (30), నికీ ప్రసాద్ (25) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 141 పరుగులు చేసి ఓటమిపాలైంది. ముంబై బౌలర్లలో నాట్ సివర్ బ్రంట్ 3 వికెట్లు పడగొట్టగా.. అమెలియా కేర్ రెండు వికెట్లు సంపాదించింది.
Read Also: Uttam Kumar Reddy : కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సాధించిన విజయం ఇది
ఫైనల్‌లో విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ ట్రోఫీని గెలుచుకోవడమే కాకుండా.. ఆ జట్టు క్రీడాకారిణి నాట్ స్కీవర్ బ్రంట్ అత్యంత విలువైన ఆటగాడిగా అంటే టోర్నమెంట్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎంపికైంది. అంతేకాకుండా.. ఈ సీజన్‌లో నాట్ స్కీవర్ బ్రంట్ 523 పరుగులతో అత్యధిక పరుగులతో ఆరెంజ్ క్యాప్ దక్కించుకుంది. మరోవైపు.. అమేలియా కర్ పర్పుల్ క్యాప్‌ను సొంతం చేసుకుంది. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరఫున 8 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు పడగొట్టింది. ఇదిలా ఉంటే ముంబై యువ క్రీడాకారిణి అమన్‌జోత్ కౌర్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ టైటిల్‌ను అందుకుంది.
ఈ సీజన్‌లో అత్యధిక డాట్ బాల్స్ వేసినందుకు షబ్నిమ్ ఇస్మాయిల్ అవార్డును అందుకుంది. దీంతో పాటు.. ఫైనల్‌లో MI కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన అన్నాబెల్ సదర్లాండ్.. ఈ సీజన్‌లో ఉత్తమ క్యాచ్ టైటిల్‌ను అందుకుంది. ఈ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టినందుకు యాష్ గార్డనర్‌కు అవార్డు లభించింది. అత్యధిక స్ట్రైక్ రేట్‌కు షినెల్లే హెర్ని అవార్డును అందుకుంది. గుజరాత్ జెయింట్స్ కు ఫెయిర్ ప్లే అవార్డు లభించింది. మొత్తం మీద ముంబై ఇండియన్స్, ఆ జట్టు ఆటగాళ్ల ఆధిపత్యం కనిపించింది.