AP High Court: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.. అయితే, చంద్రబాబు తరపు లాయర్లు.. అటు ఏసీబీ కోర్టుతో పాటు ఏపీ హైకోర్టులో కూడా పిటిషన్లు దాఖలు చేశారు.. ఇక, చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ సందర్భంగా వర్చువల్‌గా సీఐడీ తరపున వాదనలు వినిపించారు ముకుల్ రోహత్గీ.. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌కు అనర్హుడు అని పేర్కొన్న ఆయన.. ఎఫ్‌ఐఆర్ చేసిన వెంటనే చంద్రబాబును అరెస్ట్ చేయలేదు.. రెండేళ్లు అన్ని సాక్ష్యాలు సేకరించాకే అరెస్ట్ చేశారని తెలిపారు. పోలీసులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చి చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేయాలని హైకోర్టులో వాదనలు వినిపించారు ముకుల్ రోహత్గీ.
Read Also: Sapta Sagaralu Dhati Trailer: గుండెలు పిండేందుకు రెడీ అయ్యారు కాస్కోండి!
ఇక, సెక్షన్ 319 ప్రకారం ఎన్ని ఛార్జిషీట్లు అయినా వేయవచ్చు.. ఎంతమంది సాక్షులను అయినా చేర్చొచ్చు అని సీఐడీ తరపు వాదనలు వినిపించారు లాయర్ ముకుల్ రోహత్గీ.. రూ.3 వేల కోట్లు ఎక్కడికి వెళ్లాయో నిగ్గు తేల్చాల్సి ఉందన్న ఆయన.. షెల్ కంపెనీల జాడ తీస్తున్నాం.. నిబంధనలకు వ్యతిరేకంగా ఎంవోయూ నుంచి సబ్ కాంట్రాక్ట్‌కు ఎలా వెళ్లింది? అని ప్రశ్నించారు. అన్ని బోగస్ కంపెనీలు కలిపి ప్రజాధనాన్ని లూటీ చేశాయని.. ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా నిధుల దుర్వినియోగం జరిగిందని వాదించారు. మరోవైపు.. ఈ డీల్‌కు కేబినెట్ ఆమోదం లేదని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబు పథకం ప్రకారమే తన అనుచరులతో కలిసి బోగస్ కంపెనీల పేరుతో రూ.371 కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారని హైకోర్టులో వాదనలు వినిపించారు ముకుల్ రోహత్గీ.