NTV Telugu Site icon

Mudragada Padmanabham: చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌పై ముద్రగడ తీవ్ర వ్యాఖ్యలు.. వారికి దూరంగా ఉండండి..!

Mudragada

Mudragada

Mudragada Padmanabham: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్‌ పవన్‌ కల్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.. పేద ప్రజల మనసు ఎరిగిన జగన్మోహన్ రెడ్డి పాలనతోనే వారికి న్యాయం జరుగుతుందని, రానున్న ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తుందని అన్నారు. రాజమండ్రి రూరల్ బొమ్మూరు గ్రామంలోని రూరల్ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు నాయుడు కాపులను అనగదొక్కాలని చూస్తే జగన్మోహన్ రెడ్డి అక్కున చేర్చుకున్నారని అన్నారు. ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతో కాపుల ద్రోహి పవన్ కల్యాణ్‌తో పొత్తు ఏర్పరచుకుని కుటిల రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

Read Also: CM YS Jagan: ఇది చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలకు మధ్య జరుగుతోన్న యుద్ధం..

ఇక, చంద్రబాబు నాయుడు ఎన్ని దుర్మార్గపు రాజకీయాలు చేసినా, ఎన్ని పార్టీలతో కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి చరిష్మా ముందు ఓడిపోక తప్పదని ధీమా వ్యక్తం చేశారు ముద్రగడ.. పవన్ కల్యాణ్‌ విషయానికి వస్తే కాపుల ఆత్మ గౌరవాన్ని చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టేసాడని విరుచుకుపడ్డారు. పవన్ బుద్ధిలేని పనులు చేస్తున్నాడని, ఒక్కొక్కరికి 50 వేల రూపాయలు ఇచ్చి బౌన్సర్లను పెట్టుకుని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని విమర్శించారు. దుమ్ము పడకూడదు, దూళిపడకూడదు, నన్ను ఎవరు ముట్టుకోకూడదు అంటూ బౌన్సర్లతో జనాలను కొట్టించే నాయకులు రాజకీయాలకు దూరంగా ఉండాలని హితవుపలికారు. చంద్రబాబు, పవన్ వంటి నీచ రాజకీయ నాయకులను ప్రజలు నమ్మరని, త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రజలు వారికి తగిన గుణపాఠం చెప్పి పేదల మనిషి జగన్మోహన్ రెడ్డికి మళ్లీ పట్టం కడతారని అన్నారు కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.