MS Dhoni: ఎంఎస్ ధోనీ అంటే మనకు టక్కున గుర్తుకు వచ్చేది క్రికెట్. కానీ.. ధోనీలో రెండో కోణం కూడా ఉంది. ధోనీ అంకితభావం కలిగిన దేశభక్తుడిగానూ గుర్తింపు పొందారు. దేశం కోసం తన వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టడానికి ఎప్పుడూ వెనుకాడలేదు. భారత ప్రాదేశిక సైన్యం (Territorial Army) లో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో కొనసాగుతున్నారు. అయితే, ధోనీకి ఈ అత్యున్నత హోదా ఇవ్వడం వెనుక తొలినాళ్లలో కొంత వ్యతిరేకత ఉండేదన్న ఆసక్తికర విషయాన్ని రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ వినోద్ భాటియా ఇటీవల ఒక పోడ్‌కాస్ట్‌లో పంచుకున్నారు.
READ MORE: భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
అప్పట్లో ఆర్మీ చీఫ్ జనరల్ వి.కె. సింగ్, ధోనీకి ఈ గౌరవ హోదా ఇవ్వాలని నిర్ణయించినప్పుడు వినోద్ భాటియా కొంత అసహనం వ్యక్తం చేశారట. దానికి ఒక బలమైన కారణం ఉందని భాటియా వెల్లడించారు. “భారత సైన్యంలో ‘మెరూన్ బెరెట్’ (Maroon Beret) ధరించడం అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైన విషయం. ఒక సామాన్య పౌరుడికి ఈ గౌరవాన్ని ఇవ్వడం వల్ల పారాట్రూపర్ల విలువ తగ్గుతుందేమోనని నేను భావించాను. సాధారణంగా పారాట్రూపర్ కావాలంటే ఆరు నెలల కఠినమైన శిక్షణ (ప్రొబేషన్) పూర్తి చేయాలి. ఆ శిక్షణ ఎంత కఠినంగా ఉంటుందంటే, అందులో కేవలం 20 శాతం మంది మాత్రమే విజయం సాధించగలరు. అభ్యర్థి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే స్థాయిలో ఉండే ఆ శిక్షణ లేకుండా మెరూన్ బెరెట్ ఇవ్వడం సరికాదని నేను తొలినాళ్లలో అనుకున్నాను. కానీ, ధోనీ తన ప్రవర్తనతో ఆ అంచనాలను తలకిందులు చేశారు. గౌరవ హోదా లభించిన తర్వాత ధోనీ ఒక సాధారణ సైనికుడిలాగే తన విధులను నిర్వర్తించారు. 2011లో 106 పారా టీఏ బెటాలియన్‌లో లెఫ్టినెంట్ కల్నల్‌గా చేరిన ఆయన, 2015లో ఐదు పారాచూట్ జంప్‌లు విజయవంతంగా పూర్తి చేసి ‘పారా వింగ్’ చిహ్నాన్ని సాధించారు. తనకు ఎత్తు అంటే భయమని స్వయంగా ధోనీ ఒప్పుకున్నప్పటికీ, దేశం పట్ల ఉన్న మక్కువతో ఆ భయాన్ని జయించి మరీ పారాచూట్ జంప్స్ చేశాడు.” అని రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ వినోద్ భాటియా వివరించారు. ధోనీ నిబద్ధతను దగ్గరుండి చూసిన వినోద్ భాటియా, తన పాత అభిప్రాయాన్ని పూర్తిగా మార్చుకున్నారట. ధోనీ జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (LoC) వరకు ప్రయాణించి, మన సైనిక యూనిట్లతో కలిసి పనిచేశారని వెల్లడించారు. ఒక సైనికుడికి ఉండాల్సిన క్రమశిక్షణ, నడక, గౌరవం ఆయనలో పుష్కలంగా ఉన్నాయని భాటియా కొనియాడారు. కేవలం హోదా కోసమే కాకుండా, మనసున్న సైనికుడిగా ధోనీ వ్యవహరించిన తీరు తనను ఎంతో గర్వపడేలా చేసిందని పేర్కొన్నారు.
