Captain Cool: భారత క్రికెట్ చరిత్రలో అసాధారణ నాయకత్వ నైపుణ్యాలతో మైదానంలో తనదైన ముద్ర వేసుకున్న మహేంద్ర సింగ్ ధోనీ, ఇప్పుడు తన అభిమానులు ఎంతో అభిమానంగా పిలుచుకునే “కెప్టెన్ కూల్” (Captain Cool) పేరుతో ట్రేడ్ మార్క్ పొందే దిశగా అడుగులు వేస్తున్నాడు. మైదానంలో ఎంతటి ఒత్తిడిలోనైనా ప్రశాంతంగా వ్యవహరిస్తూ భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించిన ధోనీకి “కెప్టెన్ కూల్” బిరుదు సరిగా సరిపోతుంది.
ధోనీ జూన్ 5, 2025న ఈ “Captain Cool” సంబంధిత ట్రేడ్ మార్క్ కోసం దరఖాస్తు చేశాడు. ఈ దరఖాస్తు క్రీడా శిక్షణ, క్రీడా కోచింగ్ సేవలు అనే విభాగంలో చేసారు. జూన్ 16న ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రార్ ఈ దరఖాస్తును ఆమోదించి అధికారిక ట్రేడ్‌మార్క్ జర్నల్లో ప్రచురించారు. ఇది ప్రాథమిక ఆమోదం మాత్రమే. ఇలా ప్రచురణ చేసిన తర్వాత కొన్ని వారాలపాటు ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే విచారణ కలిగి ఉంటుంది.
Read Also:Srisailam Laddu Prasadam: శ్రీశైలం లడ్డూ ప్రసాదంలో బొద్దింక ఆరోపణల వెనుక కుట్రకోణం..!
అయితే ప్రభ స్కిల్ స్పోర్ట్స్ (OPC) ప్రైవేట్ లిమిటెడ్ అనే మరో సంస్థ కూడా అదే ట్యాగ్‌లైన్ కోసం దరఖాస్తు చేసుకుంది. కానీ వారి దరఖాస్తు “రిక్టిఫికేషన్ ఫైల్డ్” కింద ఉండడంతో సరి చేసి తిరిగి సమర్పించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక ధోనీ మైదానంలో ఆటగాడిగానే కాదు.. బ్రాండ్ ధోనీగా కూడా తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. అతని కూల్ మైండ్ సెట్, వ్యూహాత్మకత ఆట తీరు, కెప్టెన్సీ విధానం ప్రపంచవ్యాప్తంగా అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ధోని భారత జట్టుకు 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీలతో పాటు ఎన్నో ప్రతిష్ఠాత్మక విజయాలు అందించాడు. అంతేకాదు, అన్ని ఫార్మాట్లలో ఐసీసీ ట్రోఫీలు గెలిపించిన ఏకైక కెప్టెన్ గా ధోనీ నిలిచాడు. ఇక తాజాగా అతడిని 2025 ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చేర్చారు. ఆస్ట్రేలియాకు చెందిన మ్యాథ్యూ హెడెన్, దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్ అంలాతో పాటు ఏడుగురు దిగ్గజ క్రికెటర్లతో కలిసి ధోనీకి ఈ గౌరవం లభించింది. ఇది ఆయన కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది.
ఆటకు దూరమైన తరువాత కూడా ధోనీ బిజినెస్, బ్రాండింగ్ ఇలా పలు రంగాల్లో అడుగుపెడుతూ తన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటికే సినిమా నిర్మాణం (ధోనీ ఎంటర్టైన్మెంట్), ఇస్పోర్ట్స్, అగ్రికల్చర్, బైక్ కలెక్షన్స్ తదితర రంగాల్లో చురుకుగా ఉన్న ధోనీ, ఇప్పుడు “Captain Cool” అనే స్వంత ట్యాగ్ పేరుతో వ్యాపార రంగంలో తనదైన మార్క్ ను మొదలుపెట్టబోతున్నట్లు కనిపిస్తోంది.