MP Soyam Bapu Rao fired on Adhir Ranjan chowdhury
భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్మూ గారిని రాష్ట్ర పత్నిగా అభివర్ణిస్తూ లోక్ సభ ప్రతిపక్షనేత అధీర్ రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు సోయం బాపూరావు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతల దురహంకారానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా.. దేశంలోని యావత్ గిరిజనులు, పేదలు, అణగారిన వర్గాలందరినీ కాంగ్రెస్ తీవ్రంగా అవమానించిందని ఆయన విమర్శించారు. అట్టడుగువర్గానికి చెందిన ఆదివాసీ మహిళ మొట్టమొదటిసారి రాష్ట్రపతిగా ఎన్నిక కావడం దేశానికే గౌరవమని, రాష్ట్రపతి అనే పదం పురుషులు, మహిళలకు సమానమన్నారు. కానీ గిరిజనులు, పేదలంటేనే కాంగ్రెస్ కు కడుపు మంట అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీ మహిళ భారత దేశ ప్రథమ పౌరురాలు కాకుండా అడుగడుగునా కుట్రలు చేసిందని ఆయన విమర్శించారు. కుటుంబం, వారసత్వ రాజకీయాలు, దోచుకోవడం, దాచుకోవడంపై కాంగ్రెస్ నేతలకు ఉన్న మక్కువ అట్టడుగువర్గాలను ఆదుకోవడంపై లేనేలేదని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కాంగ్రెస్ నేతలను గిరిజన జాతి క్షమించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.