ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ వ్యవహార శైలిపై బీజేపీ రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ మండిపడ్డారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం టీవీ సీరియల్ లా సాగుతుందని, అసలైన నేరస్థులను అరెస్ట్ చేయకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. ఫోన్ ట్యాపింగ్ కి మాకు ఎలాంటి సంబంధం లేదు అంటూనే.. ఇప్పుడు కాంగ్రెస్ లో బట్టి, ఉత్తం ఫోన్లు ట్యాపింగ్ జరుగుతున్నాయని కేటీఆర్ మాట్లాడుతున్నాడని, లై డిటెక్టర్ కి మేము సిద్ధం మరి రేవంత్ రెడ్డి సిద్ధమా అని కేటీఆర్ సవాల్ విసురుతున్నాడన్నారు. కానీ రేవంత్ స్పందించడం లేదన్నారు. గతంలో డ్రగ్స్ కేసులో డీఎన్ఏ టెస్ట్ కు సిద్ధమా అని కేటీఆర్ కి రేవంత్ రెడ్డి సవాల్ విసిరాడని, అప్పుడు కేటీఆర్ కూడా స్పందించ లేదని లక్ష్మణ్ అన్నారు. కేవలం బీజేపీ దృష్టి మరల్చేందుకు ఒకరిపై ఒకరు సవాల్ చేసుకుంటున్నారని, ఎవరెన్ని కుట్రలు చేసినా మోది పై ప్రజల దృష్టి మరల్చలేరని ఆయన ఉద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వం తరుపున లై డిటెక్టర్లను డీఎన్ఏ టెస్ట్ లను మేము ఏర్పాటు చేస్తామని, నిజంగా చిత్త శుద్ది ఉంటే రేవంత్ రెడ్డి, కేటీఆర్ రావాలన్నారు ఎంపీ లక్ష్మణ్.