మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణానంతరం అంత్యక్రియలు, స్మారకంపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతిపై సినీ, క్రీడా ప్రముఖులు మౌనం వహించడాన్ని ప్రశ్నించారు. మాజీ ప్రధాని మృతికి నివాళులు అర్పించే విషయంలో క్రీడా, సినీ రంగ ప్రముఖులు మౌనంగా ఉన్నారని ఆయన ఆరోపించారు.
READ MORE: Kadapa: డిప్యూటీ సీఎం ఆదేశాలతో కదిలిన అధికార యంత్రాంగం.. విచారణ వేగవంతం
సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్‌లో అభిషేక్ బెనర్జీ ఓ పోస్ట్ చేశారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ దేశానికి గొప్ప రాజకీయ నాయకుడు అని అభివర్ణించారు. “భారతదేశం తన గొప్ప రాజనీతిజ్ఞుల్లో ఒకరైన డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను కోల్పోయింది. ఆయన అపారమైన జ్ఞానం, దూర దృష్టి గల నాయకత్వం దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసింది. 1991 ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా.. ఆయన చేసిన కృషి భారతదేశాన్ని అభివృద్ధి మార్గంలో నడిపించింది. చాలా రాజకీయ వర్గాలు మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళులర్పించాయి. కానీ.. క్రీడా, ఫిల్మ్ ఇండస్ట్రీలలోని ప్రముఖులు నిశ్శబ్దం వహించడం దిగ్భ్రాంతికరం. ఇది దేశ ప్రజానికాన్ని నిరుత్సాహపరుస్తుంది. ఇలాంటి గొప్ప వ్యక్తులకు తగిన గౌరవం ఇవ్వక పోవడమే కాకుండా.. జాతీయ సమస్యలపై మౌనంగా ఉండటం ‘ఐకాన్‌లు’ అని పిలవబడే వాటిలో చాలా వరకు ఆనవాయితీగా మారింది. రైతు నిరసనలు, సీఏఏ -ఎన్‌ఆర్సీ ఉద్యమం, మణిపూర్‌లో కొనసాగుతున్న సంక్షోభం సమయంలో కూడా మౌనంగా ఉన్నారు. ఇటువంటి క్లిష్టమైన సమస్యలపై మౌనం వహించడం సరికాదు.” అని పేర్కొన్నారు.
READ MORE: Pawan Kalyan: నితీష్ కుమార్ రెడ్డిపై ఏపీ డిప్యూటీ సీఎం ప్రశంసల వర్షం..
ప్రస్తుతం మనం కొత్త సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాం. మనం ఎవరిని రోల్ మోడల్‌గా చూస్తున్నామో పునరాలోచించాల్సిన సమయం వచ్చిందని అభిషేక్ బెనర్జీ ప్రజలకు సూచించారు. వారి కెరీర్‌లకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చే వారిని, ధైర్యం, అన్యాయాలను ప్రశ్నించని వారిని ఆదరించడం ఆపుదామని పిలుపునిచ్చారు. బదులుగా, మన దేశానికి, సమాజానికి దోహదపడే వారిని, స్వాతంత్ర్య సమరయోధులు, సైనికులు, మంచి కోసం త్యాగం చేసే వ్యక్తులను గౌరవించాలని పేర్కొన్నారు.