సార్వత్రిక ఎన్నికల వేళ దేశ వ్యాప్తంగా చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. ఈ గట్టు నుంచి ఆ గట్టుకు.. ఆ గట్టు నుంచి ఈ గట్టుకు నేతలు దూకేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో వలస రాజకీయాలు జోరందుకున్నాయి. కాంగ్రెస్ నుంచి బీజేపీకి.. బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిపోతున్నారు. ఎన్నికల సమయంలో ఇవన్నీ కామన్ అనే చెప్పొచ్చు. అయితే చిత్రమేంటంటే.. ఇటీవల కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన ఓ సీనియర్ నేత, ఎంపీ తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. వేరే పార్టీలో సరైన హామీ లభించలేదో.. ఏమో తెలియదు గానీ.. తాజాగా ఢిల్లీలో సోనియాను కలిసి ట్విస్ట్ ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీకి, అస్సాంలోని బార్‌పేట లోక్‌సభ ఎంపీ పదవికి ఇటీవల అబ్దుల్ ఖలిక్ రాజీనామా చేశారు. అయితే తాజాగా ఆయన తన నిర్ణయంపై యూటర్న్ తీసుకున్నారు. బుధవారం ఢిల్లీలోని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీని కలిశారు. ఇటీవల విడుదలైన రెండు జాబితాల్లో అబ్దుల్ ఖలిక్ పేరు కనిపించలేదు. ఈసారి ఆయనకు సీటు ఇవ్వడం లేదని సమాచారం అందడంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
బుధవారం అనూహ్యంగా అబ్దుల్ ఖలీక్ ఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా లోక్‌సభ సీటు అంశంపై చర్చించారు. తనకు సీటు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
సోనియాతో భేటీ అనంతరం అబ్దుల్ ఖలీక్ మీడియాతో మాట్లాడారు. లోక్‌సభ సీటు అంశంపై సోనియాతో చర్చించినట్లు తెలిపారు. తనకు సీటు వస్తుందన్న నమ్మకం ఉందని పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని మార్చేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖర్జున ఖర్గే, రాహుల్ గాంధీ కృషి చేస్తున్నారని కొనియాడారు. ఇక తన విజ్ఞప్తిని పరిష్కరిస్తామని సోనియా హామీ ఇచ్చారని వెల్లడించారు.తన రాజీనామా లేఖను అబ్దుల్ ఖలీక్ వెనక్కి తీసుకున్నారు.
ఇదిలా ఉంటే మంగళవారం ఢిల్లీలో కాంగ్రెస్ సీఈసీ సమావేశం అయింది. మేనిఫెస్టో, అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘంగా చర్చించారు. మూడో జాబితాలో పలు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులను ఎంపిక చేసింది. త్వరలోనే కాంగ్రెస్ మూడో జాబితాను విడుదల చేయనుంది.
ఇది కూడా చదవండి: IVF Case: బిడ్డకు జన్మనిచ్చి చిక్కుల్లో పడిన సిద్దూ మూసేవాలా తల్లిదండ్రులు.. కారణం ఏంటంటే.?
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫస్ట్ ఫేజ్ ఏప్రిల్ 19న ప్రారంభం కాగా… జూన్ 1న ఏడో విడత పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. బుధవారం తొలి విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.
Lok Sabha MP from Assam's Barpeta, Abdul Khaliq meet Congress parliamentary party chairperson Sonia Gandhi, in Delhi.
He recently tendered his resignation from the Congress party. pic.twitter.com/QkVIkqnqC3
— ANI (@ANI) March 20, 2024