Palnadu: భార్య భర్తల మధ్య గొడవలు పిల్లలను రోడ్డున పడేశాయి.. బరితెగించిన తల్లి ప్రియుడి కోసం పిల్లలను వదిలేసింది. ఈ హృదయ విదారకమైన ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. భర్తతో విభేదాల కారణంగా… చరవాణిలో పరిచయమైన వ్యక్తి కోసం.. ముక్కుపచ్చలారని ఇద్దరు పిల్లను వదిలేసింది ఓ తల్లి. పిల్లల కోసమైనా.. తిరిగి వెళ్లాలని పెద్దలు, పోలీసులు నచ్చజెప్పినా ససేమీర అంటోంది. అసలు ఏం జరిగిందంటే.. విజయనగరం జిల్లాకు చెందిన ఓ మహిళ భర్తతో తరుచూ గొడవ పడుతూ ఉండేది. ఇదే సమయంలో తుమ్మలచెరువు గ్రామానికి చెందిన రాజేష్ ఆమెకు ఆన్‌లైన్‌లో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ఇద్దరి మధ్య వివాహేతర బంధానికి దారితీసింది. ఆ మహిళ భర్తను వదిలి ఐదు నెలల క్రితం తుమ్మలచెరువులోని రాజేష్ వద్దకు చేరుకుంది. మహిళ కుటుంబ సభ్యులు విషయం తెలుసుకొని పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. పోలీసులు, గ్రామపెద్దల ద్వారా నచ్చజెప్పి పిల్లలతో కలిసి ఉండేలా విజయనగరం పంపించారు. వారం క్రితం మరోసారి ఈ మహిళ మళ్ళీ రాజేష్ వద్దకు చేరుకుంది.
READ MORE: Bihar Assembly Election 2025 Date: బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. పోలింగ్ తేదీలు ఇవే
ప్రియుడి కోసం తమనే వదిలేసినట్లు ఆ ముక్క పచ్చలారని చిన్నారులకు తెలియదు కదా..? కుటుంబ సభ్యులతో కలిసి “అమ్మా.. ఎక్కడున్నావ్..” అంటూ ఆ చిన్నారులు పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. దీంతో పోలీసులు చిన్నారుల తల్లిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. ఇద్దరు పిల్లలను వదిలి ఇక్కడికి వచ్చి ఉండటం సరైన పద్ధతి కాదని, పిల్లల జీవితాలు పాడైపోతాయని పెద్దలు, పోలీసులు నచ్చజెప్పారు. అయినా ఆ మహిళ భర్త దగ్గరకు వెళ్లేందుకు ససేమీర అనడంతో.. పోలీసులకు, గ్రామ పెద్దలకు ఏమి చేయాలో పాలుపోలేదు. పిల్లలతో కలిసి ఉండేలా బలవంతం చేస్తే ఏదైనా చేసుకుంటుందేమోననే సంశయంతో మహిళకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్‌లో చిన్నారులకు పిడుగురాళ్ల పోలీసులే ఆహారం, మంచినీరు అందిస్తున్నారు. ఆ పిల్లలను చూసిన స్థానికులు, పోలీసులు కళ్లు చెమ్మగిల్లుతున్నాయి.
