దక్షిణాఫ్రికా తీరం వెంబడి ఇటీవలి సంవత్సరాలలో 60,000 కంటే ఎక్కువ ఆఫ్రికన్ పెంగ్విన్‌లు చనిపోయాయి. పెంగ్విన్ ల మృతికి కారణం ఆకలి. ఆహారం దొరక్క మృత్యువాత పడుతున్నాయి. వాటి ప్రధాన ఆహారం సార్డిన్ చేపలు దాదాపుగా కనుమరుగవుతున్నాయి అనే దిగ్భ్రాంతికరమైన విషయాన్ని కొత్త పరిశోధన వెల్లడించింది. 2004, 2012 మధ్య, దక్షిణాఫ్రికాలోని అతిపెద్ద పెంగ్విన్ కాలనీలు అయిన డాసన్ ద్వీపం, రాబెన్ ద్వీపంలోని 95% కంటే ఎక్కువ పెంగ్విన్‌లు చనిపోయాయి. ఈ పెంగ్విన్‌లు ఆకలితో చనిపోయాయని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. పెంగ్విన్‌లు ప్రతి సంవత్సరం తమ పాత ఈకలను భర్తీ చేసుకుంటాయి. ఈ ప్రక్రియ 21 రోజులు ఉంటుంది. ఈ సమయంలో, వాటికి ఆహారం దొరకకపోతే, వాటి శరీర నిల్వలు తగ్గిపోయి చనిపోతాయి.
Also Read:Zepto Order: జెప్టోలో కూరగాయలు ఆర్డర్ చేసిన మహిళ.. రూ. 24 రిఫండ్ కోసం ప్రయత్నిస్తే రూ.87,000 పోయినయ్
పెరుగుతున్న సముద్ర ఉష్ణోగ్రతలు, మారుతున్న ఉప్పు స్థాయిలు సార్డిన్లు గుడ్లు పెట్టకుండా నిరోధిస్తున్నాయి. ఇంతలో, పెద్ద ట్రాలర్లు అధికంగా చేపలు పట్టడం కొనసాగిస్తున్నాయి. 2004 నుండి, పశ్చిమ దక్షిణాఫ్రికాలో సార్డిన్ చేపలు పట్టడం ప్రతి సంవత్సరం గరిష్ట స్థాయి నుండి 75% వరకు తగ్గింది. ఇప్పుడు 10 వేల జతలు మాత్రమే మిగిలి ఉన్నాయి. 2024 నాటికి ఆఫ్రికన్ పెంగ్విన్‌లను తీవ్ర అంతరించిపోతున్న జంతువులుగా ప్రకటించారు. ప్రపంచంలో కేవలం 10,000 సంతానోత్పత్తి జతలు మాత్రమే మిగిలి ఉన్నాయి. గత 30 ఏళ్లలో వాటి సంఖ్య 80% తగ్గింది.
ఆరు అతిపెద్ద పెంగ్విన్ కాలనీల చుట్టూ వాణిజ్య పర్స్-సీన్ ఫిషింగ్ పూర్తిగా నిషేధించారు. పిల్లలను రక్షించడానికి కృత్రిమ గూళ్ళు నిర్మిస్తున్నారు. అనారోగ్య, బలహీనమైన పెంగ్విన్‌లను చేతితో పెంచుతున్నారు. వేటాడే జంతువులను (సీల్స్, సొరచేపలు వంటివి) కాలనీల నుండి దూరంగా ఉంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేడు, కేప్ టౌన్ లోని ప్రసిద్ధ బౌల్డర్స్ బీచ్ లో కూడా, పెంగ్విన్ లను గుర్తించడం కష్టం. ఒకప్పుడు వేల సంఖ్యలో ఉండగా, ఇప్పుడు కొన్ని వందల పెంగ్విన్ లు కనిపించని పరిస్థితి నెలకొన్నది.
ఈ పరిశోధనలో పాల్గొన్న డాక్టర్ రిచర్డ్ షిర్లీ (యూనివర్శిటీ ఆఫ్ ఎక్సెటర్, UK), 2011 నాటికి మనం చూసిన నష్టాలు పరిస్థితిని మరింత దిగజార్చాయని చెప్పారు. చేపల నిల్వలను త్వరగా పెంచకపోతే, కొన్ని సంవత్సరాలలో ఆఫ్రికన్ పెంగ్విన్‌లు అంతరించిపోతాయన్నారు. దక్షిణాఫ్రికా సముద్ర జీవశాస్త్రవేత్త ప్రొఫెసర్ లోరియన్ పిచెగ్రు మాట్లాడుతూ ఇది కేవలం పెంగ్విన్ సమస్య మాత్రమే కాదని అన్నారు. అనేక ఇతర జాతులు ఈ ఆహార వనరుపై ఆధారపడి ఉంటాయి. చిన్న చేపలను రక్షించకపోతే, మొత్తం సముద్ర పర్యావరణ వ్యవస్థ కూలిపోతుంది.