జమ్మూ కాశ్మీర్‌లోని సోనామార్గ్‌లో సోమవారం జెడ్-మోర్ టన్నెల్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్ నేడు అభివృద్ధిలో కొత్త కథను రాస్తోందన్నారు. ఇంతకుముందు క్లిష్టమైన పరిస్థితులు ఉండేవన్నారు. ఇప్పుడు మన కాశ్మీర్ భూమిపై స్వర్గంగా గుర్తింపు పొందుతోందని ప్రధాని తెలిపారు. రాత్రిపూట కూడా ఐస్ క్రీం తినేందుకు లాల్ చౌక్ కు వెళ్తున్నారన్నారు. గతంలో రాత్రిపూట కూడా అక్కడ తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు ఉండేవని గుర్తు చేశారు. శాంతి నెలకొన్న సందర్భంగా గత 10 సంవత్సరాలలో పర్యాటక రంగా పురోగతి సాధించిందని తెలిపారు. 2024లో జమ్మూ కాశ్మీర్‌కు 2 కోట్లకు పైగా పర్యాటకులు వచ్చారని వెల్లడించారు. ఇక్కడ సోనామార్గ్‌లో కూడా పర్యాటకులు 10 సంవత్సరాలలో 6 రెట్లు పెరిగినట్లు చెప్పారు. స్థానికులు ప్రయోజనం పొందుతున్నారన్నారు.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సొరంగాలు..
జమ్మూకాశ్మీర్ ఇప్పుడు సొరంగాలు, ఎత్తైన వంతెనలు, రోప్‌వేలకు కేంద్రంగా మారుతోందని ప్రధాని మోడీ తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సొరంగాలు ఇక్కడ నిర్మిస్తున్నారని గుర్తు చేశారు. జమ్మూ కాశ్మీర్‌లో గత 10 ఏళ్లలో చాలా విద్యాసంస్థలు స్థాపించినట్లు పేర్కొన్నారు. దీని వల్ల ఇక్కడి మన యువత ఎంతో ప్రయోజనం పొందారన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశ ప్రయాణంలో మన పర్యాటక రంగానికి పెద్దపీట వేసిందన్నారు. మెరుగైన కనెక్టివిటీ కారణంగా, పర్యాటకులు జమ్మూ కాశ్మీర్‌లోని చివరి ప్రాంతాలకు కూడా సులభంగా చేరుకుంటారని మోడీ తెలిపారు.
ఈరోజు చాలా ప్రత్యేకమైనది..
ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు అని నరేంద్ర మోడీ అన్నారు. నేడు దేశంలోని నలుమూలలా పండుగ వాతావరణం నెలకొందన్నారు. ప్రయాగ్‌రాజ్‌లో ఈరోజు నుంచే మహా కుంభోత్సవం ప్రారంభమవుతోందని ప్రధాని గుర్తు చేశారు. పుణ్యస్నానాల కోసం కోట్లాది మంది అక్కడికి తరలివస్తున్నారన్నారు. నేడు, పంజాబ్‌తో సహా మొత్తం ఉత్తర భారతదేశం లోహ్రీ పట్ల ఉత్సాహంతో నిండి ఉందని చెప్పారు. ఉత్తరాయణం, మకర సంక్రాంతి, పొంగల్ వంటి అనేక పండుగల కాలం ఇదని వెల్లడించారు. దేశంలోనూ, ప్రపంచంలోనూ ఈ పండుగలు జరుపుకుంటున్న ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.