MLC Nagababu Review on HHVM Movie: ‘పవర్ స్టార్’ పవన్ కల్యాణ్ నటించిన పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ ‘హరిహర వీరమల్లు’ జులై 24న థియేటర్లలో విడుదలైంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన వీరమల్లు చిత్రం మిశ్రమ స్పందనకే పరిమితమైంది. అయితే సినిమాలో పవన్ నటన, యాక్షన్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా వీరమల్లు సినిమాను పవన్ సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబు వీక్షించారు. సినిమా చాలా అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. సినిమాపై వైసీపీ పార్టీ దుష్ప్రచారం చేయాలని చూసింది కానీ ప్రజలు అద్భుత విజయం అందించి తిప్పి కొట్టారని నాగబాబు తెలిపారు.
ఎమ్మెల్సీ నాగబాబు మాట్లాడుతూ… ‘ఉత్తరాంధ్ర పర్యటనలో ఉండడంతో హరహర వీరమల్లు సినిమా విశాఖలో చూశాను. సినిమా చాలా అద్భుతంగా ఉంది. సినిమాపై వైసీపీ పార్టీ దుష్ప్రచారం చేయాలని చూసింది కానీ.. ప్రజలు అద్భుత విజయం అందించి తిప్పి కొట్టారు. ఇక వైసీపీ గురించి మాట్లాడటం వృధా.. పవన్ కళ్యాణ్ రాజకీయాలు ఎంత నిబద్ధతతో చేస్తారో.. సినిమాలు కూడా అంతే డెడికేషన్‌తో చేస్తారు. కోహినూర్ డైమండ్ నేపథ్యంలో సినిమా అద్భుతంగా తెరకెక్కించారు’ అని ప్రశంసించారు. విశాఖపట్నంలోని సంగం శరత్ థియేటర్లో హరిహర వీరమల్లు సినిమాను జనసేన ఎమ్మెల్సీ నాగబాబు, ఎమ్మెల్యేలు వీక్షించారు.
Also Read: CM Chandrababu: పెట్టుబడులు పెట్టండి.. పేదలకూ సాయం చేయండి!
అంతకుముందు విశాఖ జిల్లా సీతంపేట జనసేన కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో ఎమ్మెల్సీ నాగబాబు సమావేశమయ్యారు. వ్యక్తిగత ఎజెండాలతో కూటమి ఐక్యతను దెబ్బతీస్తే ఊరుకోమని హెచ్చరించారు. చివరికి హరిహర వీరమల్లు సినిమాపై కూడా దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ఎన్ని పగటి కలలు కన్నా.. మరో 20 ఏళ్లు కూటమిదే అధికారమని నాగబాబు పేర్కొన్నారు. జనసేన కార్యకర్తలు వైసీపీ అరాచకాలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. తన ఎమ్మెల్సీ పదవిని ఉత్తరాంధ్ర కోసం వినియోగిస్తానని నాగబాబు అన్నారు.