కుటుంబ గొడవలపై ఎమ్మెల్సీ కవిత మొదటిసారి స్పందించారు. తనది ఆస్తుల పంచాయితీ కాదుని, ఆత్మగౌరవ పంచాయితీ అంటూ.. తాను ఇష్టంగా కొలిచే లక్ష్మీ నరసింహ స్వామి, తన ఇద్దరు కొడుకులపై ప్రమాణం చేశారు. నైతికతలేని పార్టీలో తాను ఉండదల్చుకోలేదని.. అందుకే రాజీనామా చేశా అని చెప్పారు. తన రాజీనామాను మండలి చైర్మన్ వెంటనే ఆమోదించాలని కవిత కోరారు. శాసనమండలిలో కవిత భావోద్వేగం చెందారు. తన రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడుతూ.. ప్రసంగం మధ్యలో కంటతడి పెట్టారు.
‘ఇసుక అక్రమ రవాణా వల్ల నెరేళ్ల సంఘటనలు చోటుచేసుకున్నాయి. నేను ఒక్కదాన్నే కేసీఆర్‌ను ప్రశ్నించే దాన్ని. కేసీఆర్ నాకు వ్యక్తిగతంగా తండ్రి. టీఆర్ఎస్ పేరు మార్పును నేను ఒప్పుకోలేదు, ఆ మీటింగ్‌కు నేను హాజరుకాలేదు. తెలంగాణలో ఏం చేశారని దేశ రాజకీయాలు?. రాష్ట్రంలో యువకులు గత ప్రభుత్వం ఏమీ చేయలేదు. కేసీఆర్ మీద కక్ష్యతో బీజేపీ నన్ను జైలుకు పంపింది. ఇంత జరిగినా నాకు పార్టీ, నాయకులు మద్దతుగా నిలువ లేదు. కాళేశ్వరం మీద గోష్ కమిటీ, కాంగ్రెస్ పార్టీ నింద వేసింది. కేసీఆర్‌ను విమర్శిస్తే.. నేను తప్ప ఏ ఒక్కరు మాట్లాడలేదు. అవినీతి పరులైన హరీష్ రావు, ఆయన అనుచరుల పేర్లు బయట పెట్టా. జాతీయ స్థాయిలో పని చేయాలని బీఆర్ఎస్ అనుకోవడం ఒక జోక్. బీఆర్ఎస్ చీలికలను రాజకీయంగా వాడుకోవాలని కాంగ్రెస్ భావించింది’ అని ఎమ్మెల్సీ కవిత చెప్పారు.
Also Read: MLC Kavitha: నాపై కక్ష కట్టారు.. శాసనమండలిలో కవిత కంటతడి!
‘నాది ఆస్తుల పంచాయతీ అని ప్రచారం చేస్తున్నారు. నాది ఆస్తుల పంచాయతీ కాదు, ఆత్మగౌరవ పంచాయతీ. అన్ని పార్టీలు రాజ్యాంగాన్ని మార్చుకోవాలి. మహిళలకు అవకాశాలు ఇవ్వాలి. అసెంబ్లీ, మండలిలో మహిళలకు సరైన గౌరవం లేదు. అజిత్ సింగ్, శిబు సొరేన్‌లను రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక శాలువా కప్పి ఎందుకు గౌరవం ఇవ్వలేదు. నైతికత లేని బీఆర్ఎస్ పార్టీలో ఉండలేనని రాజీనామా చేశా. తెలంగాణ బాగుండాలనేది నా లక్ష్యం. గత ప్రభుత్వం చేసిన తప్పులే ఇప్పుడు చేస్తే ప్రజలే బుద్ధి చెబుతారు. నేను న్యాయం వైపు ఉన్నా.. నేను ఏ తప్పు చేయలేదు. వ్యక్తిగా ఈ సభ నుంచి వెళ్తున్నా.. మళ్ళీ ఓ శక్తిగా ఈ సభకు తిరిగి తప్పకుండా వస్తా’ అని కవిత ధీమా వ్యక్తం చేశారు.
