శాసనమండలిలో ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్ర భావోద్వేగం చెందారు. తన రాజకీయ ప్రస్థానం గురించి చెబుతూ ప్రసంగం మధ్యలో కంటతడి పెట్టారు. 8 ఏళ్లుగా ప్రజల కోసం తాను చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకున్నారన్నారు. పార్టీ మౌత్ పీస్‌గా ఉన్న ఛానెళ్లు, పేపర్లు తనకు ఏనాడూ మద్దతు ఇవ్వలేదన్నారు. తాను ప్రశ్నిస్తే మాజీ సీఎం కేసీఆర్ వెంట ఉండే కొందరు వ్యక్తులు కక్షగట్టారని చెప్పారు. బీఆర్ఎస్‌లో మొదటి నుంచి తనపై ఒత్తిళ్లు ఉన్నాయని శాసనమండలిలో ఎమ్మెల్సీ కవిత భావోద్వేగ ప్రసంగం చేశారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామాపై కవిత వివరణ ఇచ్చారు.
శాసనమండలిలో కవిత మాట్లాడుతూ… ‘నా రాజీనామాను ఆమోదించాలని కోరుతున్నా. తెలంగాణ జాగృతిని స్థాపించి ఉద్యమంలోకి వచ్చాను. బీఆర్ఎస్‌లో చేరిక ముందే జాగృతిని స్థాపించా. తెలంగాణ కోసమే ఉద్యమంలోకి వచ్చా. 8 ఏళ్లుగా ప్రజల కోసం నేను చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. బీఆర్ఎస్‌లో మొదటి నుంచి నాపై ఒత్తిళ్లు ఉన్నాయి. ప్రశ్నిస్తే నాపై కక్ష కట్టారు కేసీఆర్ వెంట ఉండే కొందరు వ్యక్తులు. ప్రభుత్వంలో అవినీతిని ప్రశ్నిస్తూ వచ్చాను. కలెక్టరేట్లు కట్టిన రెండు నెలలకే కూలాయి. అమర దీపం నిర్మాణంలో అవినీతి జరిగింది. నేను ప్రజల గురించి, సమస్యల గురించి చెప్పిన విషయాలను ఎవరూ పట్టించుకోలేదు’ అని అన్నారు.
భావోద్వేగాలు మధ్య రాజీనామా చేయడం సరైంది కాదని, రాజీనామా అంశంలో పునరాలోచన చేయండని ఎమ్మెల్సీ కవితకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. కవిత బదుసలిస్తూ… ‘నేను రాజీనామా సమర్పించి ఇప్పటికే నాలుగు నెలలు అయ్యింది. బీఆర్ఎస్ పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీ నాకు వద్దు. నా రాజీనామా వెంటనే ఆమోదించండి’ అని కోరారు.