MLC Nominations: తెలంగాణలో ఇటీవల నిర్వహించిన ఎమ్మెల్సీ (MLC) ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ పార్టీ విజయకేతనం ఎగరవేసింది. ఉపాధ్యాయ, పట్టభద్రుల కోటాల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలు జరగగా, ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు నేడు (సోమవారం) చివరి రోజు. మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాల కోసం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇందుకోసం కాంగ్రెస్ నుంచి నలుగురు, బీఆర్‌ఎస్ నుంచి ఒక అభ్యర్థి పోటీలో ఉండటం వల్ల ఈ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగే అవకాశం కనిపిస్తోంది.
Read Also: Group1 Results: గ్రూప్-1 అభ్యర్థులకు శుభవార్త.. నేడు విడుదలకానున్న ఫలితాలు
రాష్ట్రంలో ఐదు ఎమ్మెల్సీ స్థానాల కోసం కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్, సీపీఐ (CPI) అభ్యర్థి సత్యం మొత్తం నలుగురు పోటీలో నిలిచారు. మరోవైపు బీఆర్‌ఎస్ (BRS) పార్టీ నుంచి దాసోజు శ్రవణ్ ఏకైక అభ్యర్థిగా బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపికైన అభ్యర్థుల నామినేషన్ పత్రాలను బలపరుస్తూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్‌లు ఎమ్మెల్యేల సంతకాలను సేకరించారు. ఇందుకు సంబంధించి నేడు అసెంబ్లీలో నామినేషన్ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలు హాజరుకానున్నారు. నామినేషన్ పత్రాల పరిశీలన తరువాత అధికారికంగా అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. మొత్తం ఐదు స్థానాల్లో పోటీ కొనసాగుతుండగా.. కాంగ్రెస్ నుంచి నలుగురు, బీఆర్‌ఎస్ నుంచి ఒక అభ్యర్థి మాత్రమే బరిలో ఉండడంతో.. అనుకున్నట్లుగానే ఈ ఎన్నిక ఏకగ్రీవంగా పూర్తి కానుంది. ఎలాంటి అవాంతరం లేకపోతే, నామినేషన్ పత్రాల పరిశీలన తరువాత అధికారికంగా విజేతలను ప్రకటించే అవకాశముంది.