ప్రతి ఆరు నెలలకు ఓసారి జాబ్ మేళా నిర్వహిస్తాం అని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. తాను వార్డు స్థాయి నుంచి ఎమ్మెల్యే వరకు ఎదిగానని, ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. జీతం తక్కువైనా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. చంద్రగిరి మండలం నారావారిపల్లెలో ఎమ్మెల్యే పులివర్తి నాని జాబ్ మేళాను ప్రారంభించారు. స్కిల్ డెవలప్మెంట్ డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరుగుతోంది. యువగళం పాదయాత్రలో మంత్రి నారా లోకేష్ హామీ మేరకు యువతకు ఉద్యోగ అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తోంది.
ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ… ‘యువగళం పాదయాత్రలో మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నాం. ఫుడ్, సోలార్, అగ్రికల్చర్‌లలో స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. జీతం తక్కువైనా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి. నేను వార్డు స్థాయి నుంచి ఎమ్మెల్యే వరకు ఎదిగాను. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్నత స్థాయికి చేరుకోవాలి. ప్రతి ఆరు నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తాం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నిరుద్యోగులకు మంచి అవకాశం’ అని అన్నారు.
5వ తరగతి నుంచి బీటెక్, ఎంబీఏ వరకు చదువుకున్న నిరుద్యోగులకు ఇదొక సువర్ణావకాశం. 18 సంవత్సరాల వయసు నుంచి 35 సంవత్సరాల వయస్సు వరకు రూ.22 వేల జీతం ఇవ్వనున్నారు. 1200 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. రెండు సాఫ్ట్ వేర్ కంపెనీలతో పాటు 18 ఇండస్ట్రీలలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.