Kodali Nani: రాజకీయ మనుగడ కోసమే షర్మిల కాంగ్రెస్‌లో చేరారని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ రిజెక్టెడ్ పార్టీ, ఏపీకి ద్రోహం చేసిన పార్టీ అంటూ ఆయన తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తిరిగి కోలుకునే పరిస్థితి ఏపీలో లేదన్నారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరితే తమకొచ్చే ఇబ్బందేం లేదన్నారు. తెలంగాణలో ఎన్నికల సమయంలో తన పార్టీని విలీనం చేస్తామంటే అక్కడ కాంగ్రెస్ శ్రేణులు వద్దన్నాయన్నారు. అక్కడ లాభం లేదనే కాంగ్రెస్‌లో విలీనం చేయించలేదన్నారు. ఆమె కాంగ్రెస్‌లో చేరితే తమ ఓటు బ్యాంక్ ఎందుకు చీలుతుందన్నారు. అలాంటప్పుడు ఎన్టీఆర్ కూతురు పురంధేశ్వరి బీజేపీలో చేరితే టీడీపీ ఓటు బ్యాంక్ చీలదా? అని ప్రశ్నించారు. ఏపీలో కాంగ్రెస్‌కు ఒక శాతం ఓటు బ్యాంక్ కూడా లేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి వచ్చే 1 శాతం ఓట్ల వల్ల వైసీపీకి నష్టం ఏం లేదన్నారు. చంద్రబాబు కుటుంబాల మధ్య చిచ్చు పెడతారన్నారు నాని. కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేసే కుట్రలు చేస్తున్నారని అప్రమత్తంగా ఉండాలని జగన్ వైసీపీ శ్రేణులకు చెప్పారన్నారు.
Read Also: Purandeswari: పురందేశ్వరితో నాదెండ్ల మనోహర్ భేటీ.. అందుకేనా?
తమకు పనికిరాని వాళ్లు టీడీపీకి పనికొస్తారని కామెంట్స్ చేశారు. వైఎస్ చనిపోయాక కేసు పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో చనిపోయిన కాంగ్రెస్‌ను బతికించింది రాజశేఖర్ రెడ్డి అని కొడాలి నాని తెలిపారు. రాజశేఖర్ రెడ్డిని దోషిగా చూపించిన కాంగ్రెస్ రాష్ట్రంలో ఉనికి కాపాడుకోవాలంటే సీఎం జగన్‌కు బహిరంగంగా క్షమాపణ చెప్పాలన్నారు. రాజకీయ ప్రయోజనాలకోసం రాజశేఖర్ రెడ్డిని దోషిని చేశారని ఆయన పేర్కొన్నారు. వైఎస్ కుటుంబాన్ని పట్టించుకోలేదని కొడాలి తీవ్రంగా మండిపడ్డారు.