Physical Harassment: తనతో శృంగారంలో పాల్గొనమని బలవంతం చేసి ఓ వ్యక్తిని ఓ బాలుడు హత్యచేసిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఆ వ్యక్తిని హతమార్చినందుకు 16 ఏళ్ల బాలుడిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏప్రిల్ 15న ఎర్రకోట వెనుక ఫుట్‌పాత్‌పై ఓ వ్యక్తి మృతదేహం పడి ఉందని తమకు పీసీఆర్ కాల్ వచ్చిందని పోలీసులు వెల్లడించారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బృందం ఆ వ్యక్తి తలకు గాయమైనట్లు గుర్తించారు.
క్రైమ్, ఎఫ్‌ఎస్‌ఎల్ బృందాలను సంఘటనా స్థలానికి పిలిపించి విచారణ చేపట్టారు. మృతుడిని 40 నుంచి 45 సంవత్సరాల వయస్సు గల శంభుగా గుర్తించారు. మృతునికి సంబంధించిన ఇతర వివరాలు తెలియరాకపోవడంతో హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు తమ బృందాలను ఆ ప్రాంతంలో మోహరించారు. చివరకు బీహార్‌కు చెందిన నిందితుడిని పోలీసులు గుర్తించారు. ఓ మైనర్ ఈ హత్య చేసినట్లు గుర్తించి అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు.
Read Also: Ramchandra Poudel: తీవ్ర అస్వస్థతకు గురైన నేపాల్ అధ్యక్షుడు.. ఢిల్లీకి తరలింపు
సుదీర్ఘంగా విచారించిన తర్వాత, మైనర్ బాలుడు రెండేళ్ల క్రితం బీహార్‌లోని తన ఇంటిని విడిచిపెట్టి, చిత్ర పరిశ్రమలో పని చేయడానికి ముంబైకి వెళ్లాలనుకుంటున్నట్లు పోలీసులకు చెప్పాడు. కానీ అతను పాత ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో శంభుతో సన్నిహితంగా ఉన్నాడు. అప్పటి నుంచి అతనితో నివసించడం ప్రారంభించాడు. అయితే, గత రెండు, మూడు నెలలుగా శంభు తనతో అసహజ సెక్స్‌లో పాల్గొనాలని ఒత్తిడి చేస్తున్నాడని బాలుడు చెప్పినట్లు డీసీపీ (ఉత్తర) సాగర్ సింగ్ కల్సి తెలిపారు. తనపై బలవంతం చేయగా బాలుడు ఈ హత్యకు పాల్పడినట్లు డీసీపీ తెలిపారు. ఏప్రిల్ 14న శంభు బాలుడితో తనతో లైంగిక సంబంధం కలిగి ఉండమని బలవంతం చేశాడు. ఈ నేపథ్యంలో వారి మధ్య వాగ్వాదం జరిగింది. యువకుడు తలపై బరువైన వస్తువుతో వ్యక్తిని హత్య చేశాడు. ఈ నేపథ్యంలో ఆ బాలుడిని అదుపులోకి తీసుకుని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరిచిన తర్వాత బాలుడిని అబ్జర్వేషన్ హోమ్‌కు పంపనట్లు డీసీపీ పేర్కొన్నారు. అతని కుటుంబ సభ్యులను కనుగొనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు.