ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సోదరుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డిపై సీఎంఓలో ఫిర్యాదు నమోదైంది. అధికార హోదా లేకున్నా.. కలెక్టరేట్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నందుకు మంత్రులు బీసీ జనార్ధన్ రెడ్డి, మహమ్మద్ ఫరూఖ్ సీఎంఓకు ఫిర్యాదు చేశారు. మంత్రుల ఫిర్యాదు మేరకు ఇంటలిజెన్స్ అధికారులు సమాచారాన్ని సేకరిస్తున్నారు.
నంద్యాల కలెక్టరేట్‌లో ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ స్థానంలో సమీక్ష సమావేశానికి ఆళ్లగడ్డ టీడీపీ నేత విఖ్యాత్ రెడ్డి హాజరయ్యారు. మంత్రులు బీసీ జనార్ధన్ రెడ్డి, మహమ్మద్ ఫరూఖ్.. ఎమ్మెల్యేలు కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి, గౌరు చరిత.. జిల్లా కలెక్టర్ రాజకుమారి, జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డిలు సమావేశంలో పాల్గొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు వేదికపై కూర్చుని భూమా విఖ్యాత్ రెడ్డి అధికారులను ప్రశ్నించారు. ఏ అధికార హోదా లేకున్నా సమీక్ష సమావేశానికి విఖ్యాత్ రెడ్డి హాజరయ్యారని సీఎంఓకు మంత్రులు ఫిర్యాదు చేశారు.