తెలంగాణలో పత్తి జిన్నింగ్ మిల్లర్లు సమ్మె ప్రకటించిన నేపథ్యంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీఎండీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. సమ్మె కారణంగా పత్తి రైతులు ఇబ్బందులు పడకుండా, పత్తిని తక్కువ ధరలకు అమ్మాల్సిన పరిస్థితి తలెత్తకూడదని, పత్తి జిన్నింగ్ మిల్లర్లతో చర్చలు జరిపి, పత్తి కొనుగోళ్లు తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. రైతులు ఇబ్బందులకు గురికాకుండా, కష్టాలు పడకుండా, పత్తిని దిగువ ధరలకు విక్రయించవలసిన అవసరం లేకుండా చర్యలు వెంటనే తీసుకోవాలన్నారు. ఇది రైతుల ప్రయోజనాలను కాపాడడంలో కీలకమన్నారు.
READ MORE: AP Assembly Sessions 2024 LIVE UPDATES: ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ అప్‌డేట్స్
కాగా.. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బందిపెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అటువంటి వ్యాపారులపై అవసరమైతే ఎస్సెన్సియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ (ESMA) కింద చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న సంఘటనలు దృష్టికి రావటంతో స్పందించిన ముఖ్యమంత్రి వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడారు. రైతులు పండించిన పంట ఉత్పత్తుల కొనుగోళ్లలో మోసాలకు పాల్పడటం, రైతులను గందరగోళానికి గురి చేయటం, రైతులను వేధించటం లాంటి సంఘటనలపై కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.రాష్ట్రమంతటా ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా అన్ని జిల్లాల కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా ఇబ్బందులుంటే వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరించాలని ముఖ్యమంత్రి సూచించారు. రైతులను ఇబ్బంది పెట్టే వ్యాపారులపై ఎస్మా ప్రయోగించాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు సాఫీగా సాగేలా చూడాలని కలక్టర్ లకు సూచించారు.