తెలంగాణలో పత్తి జిన్నింగ్ మిల్లర్లు సమ్మె ప్రకటించిన నేపథ్యంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీఎండీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. సమ్మె కారణంగా పత్తి రైతులు ఇబ్బందులు పడకుండా, పత్తిని తక్కువ ధరలకు అమ్మాల్సిన పరిస్థితి తలెత్తకూడదని, పత్తి జిన్నింగ్ మిల్లర్లతో చర్చలు జరిపి, పత్తి కొనుగోళ్లు తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు.
ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బందిపెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అటువంటి వ్యాపారులపై అవసరమైతే ఎస్సెన్సియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ (ESMA) కింద చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న సంఘటనలు దృష్టికి రావటంతో స్పందించిన ముఖ్యమంత్రి వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడారు.