అసెంబ్లీలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సీతక్క సమాధానం ఇచ్చారు. మహిళా సాధికారత, సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేశామని మంత్రి సీతక్క గుర్తు చేశారు. ఇది మహిళలకు భద్రతతో పాటు ఆర్థికంగా ఉపశమనాన్ని కలిగించే కీలక నిర్ణయమని పేర్కొన్నారు. మహిళల రోజువారీ జీవనాన్ని సులభతరం చేయడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు.
Also Read: Beerla Ilaiah-KTR: బీఆర్‌ఎస్‌లో అంతర్గత పోరు.. కేటీఆర్ మాట్లాడుతుంటే సిగ్గేస్తుంది!
ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని మంత్రి సీతక్క చెప్పారు. మహిళలు స్వయం ఉపాధి సాధించేందుకు అవసరమైన అవకాశాలు, వనరులు కల్పిస్తూ వారి ఆర్థిక బలాన్ని పెంచడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని వివరించారు. రాష్ట్రంలోని ప్రతి మహిళ స్వయం సహాయక సంఘం (SHG) సభ్యురాలిగా ఉండాలన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు. 15 సంవత్సరాలు దాటిన బాలికల నుంచి వృద్ధ మహిళల వరకు అందరినీ మహిళా సంఘాల్లో సభ్యులుగా చేర్చుతున్నామని తెలిపారు. ఈ విధంగా మహిళలందరినీ ఒక వ్యవస్థలోకి తీసుకువచ్చి అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యమన్నారు. అదేవిధంగా కిశోర బాలికలు, వృద్ధులు, దివ్యాంగ మహిళల కోసం ప్రత్యేక మహిళా స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. వీరి అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి.. వారికి ఆర్థిక, సామాజిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.