Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ

Minister Seethakka

Minister Seethakka

Minister Seethakka: ఉద్యోగులు హక్కులతో పాటు విధులు కూడా గుర్తుంచుకోవాలని మంత్రి సీతక్క సూచించారు. స్త్రీనిధి సంస్థను అందరం కాపాడుకోవాలన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి తోడ్పాటు అందిస్తోందని వెల్లడించారు. మైక్రో ఫైనాన్స్ బాధల నుంచి మహిళలకు విముక్తి కోసం స్త్రీనిధి ఏర్పాటయిందని తెలిపారు. ఇప్పటివరకు రూ.24 వేల కోట్ల రుణాలు పంపిణీ చేసిన స్త్రీనిధి అని చెప్పారు. 32 లక్షల మహిళలకు రుణాలు అందించిందని స్పష్టం చేశారు. తెలంగాణ మహిళలకు నమ్మకమైన బ్యాంక్‌గా స్త్రీనిధి ఎదగాలన్నారు. ఇతర రాష్ట్రాలు కూడా తెలంగాణ స్త్రీనిధి మోడల్‌ను అనుసరిస్తున్నాయని.. మహిళల ఆర్థిక స్వావలంబనకు తోడ్పడుతున్న స్త్రీ నిధి బ్యాంక్‌పై కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తప్పుడు ఆరోపణలు వస్తే వెంటనే వెరిఫై చేసి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అప్పుడు ఆరోపణలతో సంస్థ ప్రతిష్ట దెబ్బతినకూడదని మంత్రి వివరించారు. మహిళల అభివృద్ధే సమాజ అభివృద్ధికి పునాది అని చెప్పారు.

“చిన్న వ్యాపారాలు, గృహాధారిత ఉపాధికి ప్రభుత్వం ప్రోత్సాహం అందింది. ఆదివాసీ మహిళల ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తున్నాం. స్త్రీనిధి మహిళల కోసం మహిళల ఆధ్వర్యంలో నడిచే సంస్థ. స్త్రీనిధిని కాపాడుకోవాలి. ఉద్యోగ అనుకూల ప్రభుత్వం మా ప్రభుత్వం. స్త్రీ నిధి ఏర్పాటులో, దాన్ని విజయవంతం చేయడంలో కృషిచేసిన విద్యాసాగర్ రెడ్డికి అభినందనలు. నూతన నాయకత్వంలో ఈ సంస్థ మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.” అని మంత్రి సీతక్క వెల్లడించారు.