రేపు స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు మచిలీపట్నం వస్తున్నట్లు మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నేషనల్ లా కాలేజీ, డంపింగ్ యార్డ్, టీటీడీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. సీఎం పర్యటన కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం అమృత్ పథకానికి మ్యాచింగ్ గ్రాంట్ కేటాయించకపోవడంతో మంచినీటి కుళాయి కనెక్షన్లు నిలిచిపోయాయని మంత్రి ఆరోపించారు. త్వరలోనే రాష్ట్రమంతా ఇంటింటికీ రక్షిత నీరు అందించేలా కుళాయి కనెక్షన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. స్వచ్ఛ భారత్ కింద కేంద్రం 2290 కోట్లు మంజూరు చేస్తే గత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో రూ.2290 కోట్లను కేంద్రం విడుదల చేయలేదని విమర్శించారు.
READ MORE: JK Polls: ప్రశాంతంగా ముగిసిన చివరి విడత పోలింగ్.. భారీగా ఓటింగ్ నమోదు
వర్షపు నీటి కాల్వల ఆక్రమణల తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. బుడ మేరు ఆక్రమణల వల్ల విజయవాడ కు భారీ వరద వచ్చిందని మంత్రి అన్నారు. ఆపరేషన్ బుడ మేరు మాదిరిగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్ల అక్రమ నిర్మాణాలపై దృష్టి పెడతామని తెలిపారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కాలువలు ఆక్రమించిన వారు స్వచ్ఛందంగా ఖాళీ చేయాలని హెచ్చరించారు. ఏ రాజకీయ పార్టీ వారైనా, ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. పేదలకు ప్రత్యామ్నాయం చూపించి అక్రమ నిర్మాణాల కూల్చివేస్తామని హామీ ఇచ్చారు. పేదవారిని ఇబ్బంది పెట్టకుండా టిడ్కో ఇళ్ల వంటి ప్రత్యామ్నాయం చూపిస్తామన్నారు. పేదలకు ప్రత్యామ్నాయం చూపించి వారిని సంతోష పెట్టిన తర్వాతనే ముందుకెళ్తామని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలకు విమర్శలకు అవకాశం ఇవ్వకుండా ముందుకెళతామని స్పష్టం చేశారు.