తెలంగాణ రాష్ట్రం ఇస్తే చాలు రాష్ట్రానికి కాపలా కుక్కలా ఉంటానన్న గత ప్రభుత్వ పెద్దలు వేటకుక్కలుగా మారి అందినకాడికి దోచుకున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. కాపలా కుక్కలు వేట కుక్కలుగా మారి రాష్ట్రంలో భూదోపిడీ చేశాయని.. ఈ దోపిడి పై ఫోరెన్సిక్ ఆడిట్ చేపిస్తామని తెలిపారు. “సమాజంలో అట్టడుగు వర్గాలు మొదలుకొని భూ యజమానులకు మేలు చేసే విధంగా విస్తృత స్ధాయిలో ప్రజాభిప్రాయ సేకరణతో రూపొందించిన 2024 భూ భారతి చట్టం అక్షరాలా భూ యజమానులకు చుట్టం.” అని మంత్రి అన్నారు. ఇటు రాష్ట్రంలో.. అటు దేశంలో 2014కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకువచ్చిన రెవెన్యూ చట్టాలు, సంస్కరణలు రైతాంగానికే కాకుండా యావత్తు ప్రజానీకానికి ఎంతో మేలు చేశాయని చెప్పడానికి గర్వపడుతున్నానని మంత్రి పొంగులేటి తెలిపారు.
Read Also: Violence against Hindus: పాకిస్తాన్‌లో కన్నా బంగ్లాదేశ్‌లోనే హిందువులపై ఎక్కువ దాడులు..
దేశ రైతు చరిత్రను సరికొత్త సంస్కరణలతో లిఖించిన ముగ్గురు వ్యక్తుల గురించి చెప్పాలి. అదృష్టవశాత్తూ ఈ సంస్కరణల త్రయం తెలంగాణ బిడ్డలే కావడం మరో విశేషం. భూకమతాల పరిమితి చట్టం తెచ్చిన నాటి ముఖ్యమంత్రి, తెలుగు ప్రధాని పీవీ నరసింహారావు, కౌలు రైతులకు మేలు చేసే విధంగా రక్షిత కౌలుదారి చట్టం తీసుకువచ్చిన నాటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు.. అదేవిధంగా జాగీర్ల రద్దులో కీలకంగా వ్యవహరించిన మాజీ ఉప ముఖ్యమంత్రి కొండా వెంకట రంగారెడ్డి తమకు దిశానిర్దేశకులు అని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. ఇప్పుడు వారి అడుగుజాడల్లో ప్రజోపయోగమైన ఈ నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చామని తెలిపారు. మన రాష్ట్రానికి సంబంధించి ఒక్కసారి గత చరిత్రను పరిశీలిస్తే భూమి కోసం, భుక్తి కోసం.. వేలాది పీడిత రైతులు, కూలీలు పాల్గొన్న తెలంగాణ సాయుధ పోరాటం చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం అని అన్నారు.
Read Also: CM Chandrababu Warning: భూకబ్జాలపై సీఎం సీరియస్.. తాట తీస్తా..!
రెండు పిల్లుల రొట్టెకథ ఈ ధరణి:
మనం చిన్నప్పుడు చదువుకున్న రెండు పిల్లులు రొట్టె కథలాగే ఈ ధరణి ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రొట్టె పంచుకోవడం కోసం ఆ రెండు పిల్లులు గొడవ పడడం.. ఓ కోతి వచ్చి ఆ గొడవ తీరుస్తానని చెప్పడం, ఆ రొట్టెను 2 ముక్కలు చేస్తూ ఒకటి ఎక్కువైందని ఒకసారి, రెండవ ముక్క ఎక్కువైందని మరోసారి రొట్టెను పూర్తిగా కోతి తినేయడం మనకు తెలిసిన కథ. ఆ కోతిలాగే గత ప్రభుత్వంలో కొంతమంది పెద్దలు ప్రవర్తించి భూములను దోచుకున్నారని తెలిపారు. ధరణిలో తన భూమి తాను చూసుకొనే వీల్లేదు.. ఆనాడు అంతా రహస్యమే. ఇందిరమ్మ ప్రభుత్వంలో దొరలు, సామాన్యులకు ఒకటే విధానం. భూ భారతిలో అంతా పారదర్శకమేనని మంత్రి పొంగులేటి అన్నారు. తప్పు ఒకరిది.. శిక్ష మరొకరిది అన్నట్లుగా అనాలోచితంగా రాత్రికి రాత్రే గడీల మధ్య చట్టం చేసి తప్పుచేసింది ఆ దొరవారుజ. కానీ శిక్ష అనుభవిస్తుంది మాత్రం అమాయక పేద రైతులు అని మంత్రి తెలిపారు. ఈ రాష్ట్రంలో ఏ మండలానికి వెళ్లినా.. ఏ గ్రామానికి వెళ్లినా ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా మనిషి అనే వాడు ఉన్న ప్రతిచోట ధరణి తెచ్చిన సమస్యలున్నాయని అన్నారు.