రాజధాని అమరావతి ప్రాంతంలో ఏపీ మంత్రి నారాయణ పర్యటించారు. ప్రధాని నరేంద్ర మోడీ సభకు వచ్చే రహదారులను ఆయన పరిశీలించారు. గుంటూరు, ఏలూరు, విజయవాడ ఇతర జిల్లాల నుంచి వచ్చే ప్రజలకు సంబంధించి రహదారి మార్గాల విషయంలో అధికారులకు మంత్రి సూచనలు చేశారు. కొన్ని రోడ్లు వెంటనే వెడల్పు చెయ్యాలని ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి నారాయణ అధికారులకు చెప్పారు. ప్రధాని మోడీ మే 2న అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభం కోసం వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోడ్లు, ట్రాఫిక్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.
Also Read: PSR Anjaneyulu: జడ్జి ముందు తన వాదనలు తానే వినిపించిన పీఎస్‌ఆర్!
‘రాజధాని ప్రాంతంలో 64 వేల కోట్ల విలువైన టెండర్లు పిలిచాము. వచ్చే నెల 2న మరలా రాజధాని పనులు ప్రధాని మోడీ చేతుల మీదుగా రీ లాంచ్ జరుగుతుంది. వచ్చే నెల 2న ప్రధాని సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. 5 లక్షల మంది ప్రజలు బహిరంగ సభకు హాజరవుతారని అంచనా. రాజధానిలో కొన్ని రోడ్ల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. పోలీసు శాఖ సమన్వయంతో సీఆర్డీఏ సిబ్బందితో రాజధాని ప్రాంతంలో పర్యటన చేశాం. 8 రోడ్డు మార్గాల్లో సభకు చేరుకోవచ్చు. తాడికొండ, హరిశ్చంద్రపురం, ప్రకాశం బెరేజ్.. ఇలా కొన్ని మార్గాల్లో సభకు చేరుకునే విధంగా ఏర్పాటు జరుగుతుంది. 11 ప్రాంతాల్లో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేసాము. ప్రధాని హెలిప్యాడ్లో దిగిన తర్వాత సెక్యూరిటీ సూచనల ప్రకారం ఒక కిమి రోడ్ షో ఉంటుంది’ అని మంత్రి నారాయణ తెలిపారు.