Minister Narayana: వైసీపీ ప్రభుత్వంలో ప్రజలను భయబ్రాంతులకు గురి చేసి కబ్జాలకు పాల్పడ్డారని మంత్రి నారాయణ తీవ్రంగా విమర్శించారు. సెంటు భూమి నుంచి వేల ఎకరాల వరకూ వైసీపీ ప్రభుత్వంలో కబ్జా జరిగిందన్నారు. పరిశ్రమలు, పోర్టులను సైతం కబ్జా చేశారని ఆరోపించారు. గత అరాచక ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, నాయకులు దోపిడీ చేశారని ఆయన విమర్శలు గుప్పించారు. నెల్లూరు సిటీ నియోజగవర్గంలోని ఏసీ నగర్‌లో జరిగిన రెవెన్యూ సదస్సుల్లో మంత్రి నారాయణ, కలెక్టర్ ఆనంద్ పాల్గొన్నారు.
ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలలో భాగంగా ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లును తీసుకొచ్చామన్నారు. ప్రజల ఆస్తిని కాపాడేందుకే ఈ బిల్లును తీసుకువచ్చామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ప్రైవేట్ వ్యక్తి ఆస్తి లాక్కున్నా, ప్రభుత్వ భూమిని కబ్జా చేసినా నాన్ బెయిల్ క్రింద 10 నుండి 14 సంవత్సరాల వరకూ జైలు శిక్ష పడుతుందన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను పరిష్కరించేందుకే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని మంత్రి చెప్పారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన భూ సమస్యలను నెల రోజుల్లో అధికారులు పరిష్కరిస్తారని తెలిపారు. ప్రజా సమస్యలు పరిష్కరించే చట్టాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రికి ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. వీలైనంత త్వరగా భూ సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. పరిష్కరించలేకపోయిన సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోయామో కూడా ప్రజలకు అధికారులు వివరించాలని మంత్రి స్పష్టం చేశారు.