మెగా డీఎస్సీకి ఎన్ని అవాంతరాలు ఎదురైనా విజయవంతంగా పూర్తిచేశాం అని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. 106 కేసులు ఎదుర్కొని కార్యక్రమాన్ని జయప్రదం చేశామన్నారు. మెగా డీఎస్సీ నియామకపత్రాలు అందజేతకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నను ఆహ్వానించా అని చెప్పారు. నియామక పత్రాలు అందజేత కార్యక్రమానికి తప్పకుండా వస్తానని పవన్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఇక ప్రతిఏటా ఓ పద్ధతి ప్రకారం డీఎస్సీ నిర్వహిస్తాం అని మంత్రి లోకేశ్ చెప్పుకొచ్చారు. అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో మంత్రి లోకేష్ మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.
‘మెగా డీఎస్సీకి ఎన్ని అవాంతరాలు ఎదురైనా విజయవంతంగా పూర్తిచేశాం. 106 కేసులు ఎదుర్కొని కార్యక్రమాన్ని జయప్రదం చేశాం. నియామక పత్రాల అందజేతకు రావాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నను ఆహ్వానించా. కార్యక్రమానికి తప్పకుండా వస్తానని అన్నారు. ఇక ఏటా ఓ పద్ధతి ప్రకారం డీఎస్సీ నిర్వహిస్తాం. సెప్టెంబర్ నెలాఖరుకు విద్యార్థుల అడ్మిషన్లపై స్పష్టత వస్తుంది. తల్లికి వందనంతో పాటు 3 నెలల్లో అన్ని బకాయిలు చెల్లిస్తాం. క్వాంటమ్ కంప్యూటర్ జనవరిలో వచ్చేస్తుంది. భవనం అందుబాటులోకి వచ్చేవరకు విట్‌లో సేవలు ఉంటాయి’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
‘టీటీడీ పరకామణి చోరీపై త్వరలో సిట్ విచారణకు ఆదేశిస్తాం. వైఎస్ జగన్ అండ్ టీం దేవుడి దగ్గర నాటకాలు ఆడారు, అందుకే దేవుడు ఏం చేయాలో అది చేశాడు. వైసీపీ హయాంలో పరకామణి దొంగను అరెస్ట్ చేయకుండా 41ఏ నోటీసులు ఇచ్చి పంపిచేశారు. ఈ కేసులో ఎన్నో వాస్తవాలు బయటకు రావాల్సి ఉంది. తిరుపతి కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక ఆధారాలు బయటకు వస్తున్నాయి. నెయ్యి అని చెబుతున్న పదార్థంలో నెయ్యి లేదని సీబీఐ దర్యాప్తులో తేలింది. వైఎస్ జగన్ ఏ పనులు చేయలేదు, మమ్మల్సి కూడా చేయనివ్వమంటే ఎలా?. తన మనుషులకు ఇచ్చిన కాంట్రాక్టులు పోతున్నాయనేది జగన్ ఆందోళనలా ఉంది’ అని మంత్రి లోకేష్ మండిపడ్డారు.
Also Read: MLA Madhavi: ఎమ్మెల్యే మాధవికి మంచి బుద్ధి ప్రసాదించాలని ఆలయంలో పూజలు!
‘అక్టోబర్ నుంచి వరుస పెట్టుబడులు రాష్ట్రానికి తెచ్చేలా ప్రణాళికలు చేశాం. పారిశ్రామికవేత్తలను ఒప్పించి రాష్ట్రానికి పెట్టుబుడులు తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నాం. 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా నిర్విరామ కృషి జరుగుతోంది. ప్రజా ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రైవేటును భాగస్వామ్యం చేస్తే ప్రైవేటీకరణా?. సామాన్యుడికి మెరుగైన సేవలు త్వరగా తెచ్చేందుకే పీపీపీ విధానంలో వైద్య కళాశాలలు. రోడ్లు, విమానాశ్రయాలు ఇలా అనేకం ప్రభుత్వం పీపీపీలో వెళ్తోంది’ అని మంత్రి లోకేష్ చెప్పుకొచ్చారు.