Minister Nara Lokesh: ఏపీలో పెట్టుబడులపై ఈ నెల 25 నుంచి మంత్రి నారా లోకేశ్ అమెరికాలో పర్యటించనున్నారు. నవంబర్ ఒకటో తేదీ వరకు శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో లోకేశ్ పర్యటించనున్నారు. ఈ నెల 25 తేదీన అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగే ఐటీ సినర్జీ కాన్పరెన్సుకు మంత్రి హాజరు కానున్నారు. ఏపీలో పెట్టుబడులపై ప్రముఖ కంపెనీలతో మంత్రి లోకేశ్ భేటీ కానున్నారు. నారా లోకేష్ వెంట సీఎం అదనపు కార్యదర్శి కార్తికేయ మిశ్రా, ఏపీఈడీబీ సీఈఓ సాయికాంత్ వర్మ వెళ్లనున్నారు. అప్పటి వరకూ ఏపీఈడీబీ సీఈఓగా సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి సురేష్ కుమార్‌కు ఆ బాధ్యతలను అప్పగించారు.
Read Also: CM Chandrababu: ఇంతకంటే మంచి సమయం లేదు.. రాష్ట్రంలో పెట్టుబడులకు సీఎం చంద్రబాబు ఆహ్వానం
రాష్ట్రంలో పెట్టుబడులకు కొత్త పాలసీలతో ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఆహ్వానం పలుకుతున్న సంగతి తెలిసిందే. బెస్ట్ పారిశ్రామిక పాలసీలతో ఏపీ ఇప్పుడు పెట్టుబడులకు సిద్దంగా ఉందంటూ ముఖ్యమంత్రి ట్వీట్ కూడా చేశారు. ఏపీలో కార్యకలాపాలకు పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ స్వాగతం అంటూ ముఖ్యమంత్రి స్వాగతం పలికారు. సమర్థులైన యువత, స్నేహ పూర్వక ప్రభుత్వం, మౌళిక సదుపాయాలతో పెట్టుబడులకు ఏపీ స్వర్గధామం అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పెట్టుబడులతో మీ వ్యాపారం పెరుగుతుంది…మా రాష్ట్రం వృద్ధి చెందుతుంది అంటూ పారిశ్రామికవేత్తలకు సీఎం ఆహ్వానం పలికారు. ఈ క్రమంలోనే లోకేశ్ అమెరికా పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఆయన మంత్రిగా బాధ్యత స్వీకరించిన తర్వాత తొలిసారి అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. ఏపీలో పెట్టుబడులను తీసుకుని రావాలని తద్వారా ఏపీలో ఉపాధి కల్పన అవకాశాలను పెంచాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోంది.