Minister Nadendla Manohar: తిరుపతిలో దీపం-2 పథకం కార్యక్రమాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసే వారిపై ఛాలెంజ్ విసురుతున్నానని.. వైసీపీ నేతలు దీపం-2 పథకం కార్యక్రమాలకు రావాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉచిత సిలిండర్ ఇస్తున్న విషయాన్ని వైసీపీ నేతలు గమనించాలన్నారు. వైసీపీ నేతలు చెప్పే మాటలను ప్రజలు నమ్మవద్దన్నారు. దేశంలో ఎక్కడా లేని దీపం పథకాన్ని ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం నిజాయితీతో, చిత్తశుద్థితో పనిచేస్తోందని చెప్పారు. బటన్ నొక్కామని ప్రజలను నిత్యం మోసం చేసిన వారెవరో ప్రజలకు తెలుసన్నారు. మహిళలకు ఆర్థిక వెసులుబాటు కల్పిస్తున్నామన్నారు. ప్రతి మహిళకు భరోసా ఇచ్చేందుకు వీలుగా దీపం-2 పథకాన్ని తీసుకొచ్చామన్నారు.
Read Also: CM Chandrababu: రెండు మూడు రోజుల్లో రాష్ట్ర భవిష్యత్తును మార్చే కొత్త ప్రణాళిక
వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నామన్నారు. ఐదేళ్ల వైసీపీ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. రాష్ట్రాన్ని 11లక్షల అప్పులో నెట్టారన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ సిక్స్ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఏపీలో 55లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి..50లక్షల మందికి సిలిండర్లను అందజేస్తామన్నారు. నవంబర్ నుంచి మార్చి వరకు సిలిండర్లను బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. సిలిండర్లు బుక్ చేసిన 24 గంటల్లోపే అర్హులైన వారి ఖాతాలో డబ్బులు జమ అవుతుందన్నారు. రాష్ట్రంలో 12 లక్షల మంది అర్హులైన వారు ఇప్పటి వరకు సిలిండర్లను బుక్ చేశారని పేర్కొన్నారు. మహిళల ఆరోగ్య పరిస్థితిని మార్చేందుకు, మహిళల జీవితాల్లో వెలుగులు నింపేందుకు దీపం పథకాన్ని తీసుకొచ్చామన్నారు.