KTR: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ఇవాళ మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నారు. మనోహరాబాద్‌లో రూ.460 కోట్ల పెట్టుబడితో 59ఎకరాల్లో నిర్మించిన ఐటీసీ పరిశ్రమను ప్రారంభించారు. సోమవారం నుంచి ఉత్పత్తులను అధికారికంగా ప్రారంభించనున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా స్థానికంగా వేయిమంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు పరిశ్రమ ప్రతినిధులు తెలిపారు. పరిశ్రమ ప్రారంభోత్సవంతో స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమకు జీవనోపాధి దొరుకుతుందని చెబుతున్నారు. అనంతరం ఐటీసీ పరిశ్రమలో ఏర్పాటు చేసిన ఉత్పత్తుల ప్రదర్శనను కేటీఆర్ తిలకించారు. రూ.450కోట్ల పెట్టుబడితో ఐటీసీ ఈ పరిశ్రమను నిర్మించింది. ఐజీబీసీ నుంచి ప్లాటినం గ్రీన్ బిల్డింగ్ ధ్రువీకరణ పొందింది. మనోహరాబాద్ పరిశ్రమ సిబ్బందిలో 50 శాతం మహిళలు ఉన్నారు. పరిశ్రమ ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడారు. కేసీఆర్ నియోజకవర్గంలో ఇంత పెద్ద పరిశ్రమ రావడం సంతోషంగా ఉందన్నారు కేటీఆర్.
Read Also: Attack On Singer: పాట పాడాలని ప్రముఖ సింగర్ పైకి వాటర్ బాటిళ్లు విసిరిన ఫ్యాన్స్
కంపెనీ కోసం భూములు కోల్పోయిన వారికి ఆదుకునే బాధ్యత మనపై ఉందని మంత్రి పరిశ్రమ యాజమాన్యానికి సూచించారు. స్థానికులకు ఉపాధి అవకాశం కల్పించేలా ఐటీసీ యాజమాన్యం చర్యలు తీసుకోవాలన్నారు. రైతుల ఆదాయం పెంచేందుకే నీలి విప్లం వచ్చిందని కేటీఆర్ అన్నారు. విజయ డెయిరీ ద్వారా రైతులకు ఆదాయం పెరుగుతోందని చెప్పారు. పరిశ్రమలు వచ్చినప్పుడు స్థానిక నేతలు సహకరించాలని కోరారు. పరిశ్రమలతో యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని వెల్లడించారు. కంపెనీ తయారు చేసే చిప్స్, బిస్కెట్స్ కోసం ఆలుగడ్డలు, గోధుమలు ఇక్కడే కొనాలని ITC చైర్మన్ కి విన్నవించారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని తక్కువ సమయంలో పూర్తి చేశామన్నారు మంత్రి. అంతే కాకుండా 10 టీఎంసీల నీరు పరిశ్రమలకు కాళేశ్వరం ద్వారా అందిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. నీటి వనరుల్లో విప్లవం సాధించామని… ఇంటింటికి మంచి నీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణగా మంత్రి పేర్కొన్నారు. నేడు 68 లక్షల నుంచి మూడున్నర కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించే స్థాయికి రాష్ట్రం ఎదిగిందని.. కోళ్ల పరిశ్రమకి , దాణాకి తెలంగాణ కేంద్రంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్. 46 వేల చెరువులను మిషన్ కాకతీయ ద్వారా బాగు చేసాం.. ఫుడ్ ప్రాసెస్సింగ్ హబ్ కోసం స్పెషల్ సెజ్ ని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.