NTV Telugu Site icon

KTR: రేవంత్‌ రెడ్డి, బండి సంజయ్‌కి కేటీఆర్ లీగల్‌ నోటీసులు

Ktr

Ktr

KTR: రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు ఇచ్చారు. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌లో తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని నోటీసుల్లో పేర్కొన్నారు. ఉద్యోగాల జాతరకు పాతరేయాలన్న విపక్షాల కుట్రలు సాగనివ్వబోమని మంత్రి పేర్కొన్నారు. ఒక్క దురదృష్టకర సంఘటనను బూచిగా చూపి మొత్తం నియామకాల ప్రక్రియను ఆపేయాలన్నదే బీజేపీ, కాంగ్రెస్ కుతంత్రమని ఆరోపించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేరు.. ప్రభుత్వం వేరు అన్న ఇంగిత జ్ఞానం లేని అజ్ఞానులంటూ మండిపడ్డారు. వెకిలి మకిలి ఆరోపణలతో బట్టగాల్చి మీదేసే చిల్లర ప్రయత్నాలను సహించేది లేదన్నారు. మతిలేని మాటలు మాట్లాడుతున్న పిచ్చి నేతల రాజకీయ ఉచ్చులో యువత చిక్కుకోవద్దన్నారు. ఉద్యోగాల ప్రిపరేషన్‌ను కొనసాగించాలని యువతకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

Read Also: Parliament Impasse: లోక్ సభ స్పీకర్‌తో ప్రధాని మోదీ భేటీ.. రాహుల్ అంశంపై చర్చ?

ఇదిలా ఉండగా ఈ వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఇప్పటికే సిట్​ నోటీసులు జారీ చేయగా.. రేపటి సిట్ విచారణకు సంజయ్ హాజరు కావడంలేదని బీజేపీ వర్గాలు తెలిపాయి. తనకు సిట్ నోటీసులు అందలేదని స్పష్టం చేసిన బండి సంజయ్.. సిట్‌పై నమ్మకం లేదన్నారు. సిట్టింగ్ జడ్జితో ఈ కేసు విచారణ జరిపించాలని సంజయ్​ డిమాండ్​ చేశారు. పార్లమెంట్ సమావేశాల వల్ల ప్రస్తుతం ఢిల్లీలోనే బండి సంజయ్ ఉన్నారు. ఈ నేపథ్యంలో రేపటి విచారణకు హాజరవుతారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు పేపర్ లీకేజీ కేసులో మంత్రి కేటీఆర్​ పీఏపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి ఇవాళ సిట్​ విచారణకు హాజరయ్యారు. తన దగ్గర ఉన్న ఆధారాలు సిట్​ అధికారులకు సమర్పించినట్లు ఆయన పేర్కొన్నారు. విచారణ అనంతరం మాట్లాడిన రేవంత్‌రెడ్డి.. ప్రతిపక్షాలను ప్రభుత్వం విచారణల పేరుతో భయపెడుతోందని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతునొక్కుతోందని విమర్శించారు.

Show comments