ఇప్పటివరకు ఏపీలో 14 వేల పెన్షన్లు తొలగించాము అని, కానీ లక్షల్లో పెన్షన్లు తొలగిస్తున్నామని దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. పెన్షన్లపై సర్వే పకడ్బందీగా జరుగుతోందని, అనర్హులకు పెన్షన్ తీసేసినా తప్పులేదన్నారు. 2019 జూన్ నాటికి సామాజిక భద్రత పెన్షన్ల కింద 53 లక్షల 85 వేల 796 మంది లబ్ధిదారులు ఉండగా.. ప్రస్తుతం 63 లక్షల 59 వేల 907 మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారని మంత్రి కొండపల్లి చెప్పారు. ఏపీ అసెంబ్లీలో పెన్షన్ లబ్దిదారుల వెరిఫికేషన్ గురించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి జవాబు ఇచ్చారు.
‘2019 జూన్ నాటికి సామాజిక భద్రత పెన్షన్ల కింద 53 లక్షల 85 వేల 796 మంది లబ్ధిదారులు ఉన్నారు. ప్రస్తుతం 63 లక్షల 59 వేల 907 మంది లబ్ధిదారులు ఉన్నారు. 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు 14,967 సామాజిక భద్రత పెన్షన్లు తొలగించాము. అందులో 10,791 శాశ్వత వలస దారులు కాగా.. 4,176 మంది అనర్హులు. పెన్షన్లను తొలగిస్తున్నట్లు ఏవేవో కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఎలాంటి పెన్షన్లు తీయడం జరగలేదు. పెన్షన్లపై సర్వే పకడ్బందీగా జరుగుతోంది. అనర్హులకు పెన్షన్ తీసేసినా తప్పులేదు’ అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.
అసెంబ్లీ ప్రశ్నోత్తరాలలో రేషన్ బియ్యం అక్రమ తరలింపుపై బుచ్చయ్య చౌదరి, కూన రవికుమార్ ప్రశ్నించారు. ‘కాకినాడ పోర్టు అడ్డాగా విదేశాలకు, రీ సైక్లింగ్ కోసం బియ్యం వెళ్లిపోతోంది. బందరులో మాజీ మంత్రి, కుటుంబ సభ్యులు ఏం చేశారో అందరం చూశాం. బియ్యం సప్లైదారలు అక్కడే బియ్యం తీసుకొని అంతో, ఎంతో ఇచ్చి తీసేసుకునేవారు. వాహనాల ద్వారా కేంద్రీకృతం అయిన దోపిడీని చేశారు. బియ్యం అక్రమ రవాణా చేశారు. ఫోర్టిఫైడ్ బియ్యం ఇతర రాష్ట్రాలకు ఎందుకు ఇస్తున్నారు. ఈ రాష్ట్రంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు బ్రతకాలి. లావోస్, అశోక ఇంటర్నేషనల్ కంపెనీలు ఎవరివో తేల్చాలి. దాదాపు 1000 కోట్లు అక్రమ బియ్యంలో దోచారు. దీనికి లాండ్ గ్రాబింగ్ నిరోధక చట్టం తరహాలో ఒక చట్టం తెచ్చి రాష్ట్ర ఖజానాకు దెబ్బకొడుతున్న వారిని శిక్షించాలి’ అని అన్నారు.