Minister Kollu Ravindra: గతంలో మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి 32 వేల కోట్ల అప్పులు చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర.. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలోని సావెరి సమావేశ మందిరంలో ఎక్సైజ్ అధికారుల రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశం జరిగింది.. ఈ సమావేంలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. 2014-19 మధ్య ప్రజలకు ఇబ్బంది లేని విధంగా టీడీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చి అమలు చేశాం.. కానీ, 2019- 24 మధ్య కాలంలో ఐదేళ్లు ఎక్సైజ్ వ్యవస్థను నాశనం చేశారు. మద్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చి.. మద్యం వ్యాపారం మొత్తాన్ని చేతుల్లోకి తీసుకున్నారు. కొత్త పాలసీ పేరుతో వ్యవస్థ మొత్తాన్ని విచ్చిన్నం చేశారు.రాష్ట్రంలోని డిస్టిలరీల నుండి మద్యం షాపుల వరకు మొత్తాన్ని హస్తగతం చేసుకున్నారు. ఎన్ ఫోర్సు మెంట్ లేకుండా చేసి మద్యం అక్రమ వ్యాపారాలకు తెరలేపారు. మల్టీ నేషనల్ బ్రాండ్స్ మొత్తాన్ని మార్కెట్ నుంచి దూరం చేసి, తమ సొంత బ్రాండ్లను తీసుకొచ్చి ప్రజల నెత్తిన రుద్దారు అంటూ విరుచుకుపడ్డారు..
Read Also: JR NTR : మార్క్ శంకర్ కు అగ్ని ప్రమాదం కలిచివేసింది : జూనియర్ ఎన్టీఆర్
ఇక, గత ప్రభుత్వం అమలు చేసిన మద్యం విధానంతో ప్రభుత్వ ఆదాయం.. ప్రజల ఆరోగ్యం రెండూ తీవ్రంగా దెబ్బతిన్నాయి అన్నారు కొల్లు రవీంద్ర.. ఏపీలో నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులో లేకపోవడంతో పొరుగు రాష్ట్రాల నుండి అక్రమ రవాణా పెరిగింది.. సరిహద్దు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు పెరగగా మన రాష్ట్రంలో మద్యం ఆదాయం తీవ్రంగా కోల్పోయాం. నాసిరకం సొంత బ్రాండ్ల కారణంగా లక్షల మంది అనారోగ్యం బారిన పడగా, పలువురు కిడ్నీ, లివర్ సమస్యల బారిన పడ్డారని విమర్శించారు.. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నూతన మద్యం పాలసీ ద్వారా నాసిరకం బ్రాండ్లకు స్వస్తి పలకడం జరిగింది. 6 రాష్ట్రాల్లో అమలవుతున్న మద్యం పాలసీని అధ్యయనం చేసి నూతన పాలసీకి శ్రీకారం చుట్టాం.. పాత బ్రాండ్లను తిరిగి పునరుద్ధరించాం. 350కి పైగా బ్రాండ్లు ఏపీలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని వెల్లడించారు..
Read Also: Encounter: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్‌కౌంటర్!
మద్యం ధరలను కూడా పొరుగు రాష్ట్రాలతో సమానంగా చేయడం వలన అక్రమ రవాణా ఆగింది అన్నారు కొల్లు రవీంద్ర. గతంలో ఉన్న బెల్టు షాపులపై కూడా చర్యలు తీసుకోవడంతో దాదాపు నిర్మూలించాం.. గత ఐదేళ్లు ఎక్సైజ్ శాఖను విచ్చిన్నం చేసి SEB ఏర్పాటుతో ఎన్ఫోర్స్మెంట్ కూడా సరిగా లేకుండా పోయింది. నవోదయం 2.0 ద్వారా సారా రహిత రాష్ట్రంగా ఏపీని మార్చేలా చర్యలు తీసుకుంటున్నాం అని వెల్లడించారు.. గంజాయి నిర్మూలన కోసం హోమ్ శాఖతో సమన్వయం చేసుకుంటూ ప్రత్యేకంగా ఈగల్ టీంలను ఏర్పాటు చేసుకున్నాం.. టూరిజం పెంపు కోసం 3స్టార్ హోటల్ కి లైసెన్స్ ఫీజు తగ్గించేలా నిర్ణయం తీసుకున్నాం.. గతంలో మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి 32 వేల కోట్ల అప్పులు చేశారు.. గత ఐదేళ్ల అక్రమాల గురించి ఆ పార్టీ నేతలే బట్టబయలు చేశారు. క్యాష్ అండ్ క్యారీ.. విధానంతో దాదాపు లక్ష కోట్ల లావాదేవీలు జరగడంపై సీఐడీ విచారణ జరుగుతోందన్నారు.. కానీ కూటమి పాలనలో అన్ని షాపుల్లో డిజిటల్ పేమెంట్స్ అందుబాటులో ఉంచి పారదర్శకతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం.. మరోవైపు ఆన్ లైన్ ఇండెంట్, ట్రాక్ అండ్ ట్రేస్ విధానంతో పారదర్శకతకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర..